Konaseema News: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరి స్వార్థం వల్ల గ్రామ ప్రజల రాక పోకలకు తీవ్ర ఇబ్బంది కల్గుతోంది. సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న చిన్న పల్లె.. ఉప్పుటేరుని దాటుకుని ఉన్నటువంటి ఏకైక చిన్న వంతెనపై వెళ్లాల్సిన పరిస్థితి ఆ పల్లె ప్రజలది. ఆ వంతెన కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారులు నిర్లక్ష్యం ఓ వైపు, అక్రమార్కుల ఆగడాలు మరోవైపు. ఈ రెండింటి కారణంగా పల్లె ప్రజలంతా కష్టపడాల్సి వస్తోంది. అక్రమాన్ని ప్రశ్నించకపోవడం వలన ఏం జరుగుతుంది అనేది ఎట్టకేలకు ఆ గ్రామస్తులకు తెలిసి వచ్చింది. ఇంతకీ ఈ మత్స్యకార గ్రామంలో ఏం జరిగిందో ఆ వివరాలిలా ఉన్నాయి..
బ్రిడ్జిపై ఓవర్ లోడ్ వాహనాలు..
ఈ కింది ఫొటోలో తెలుపు డ్రెస్ లో కనిపిస్తున్న వ్యక్తి తీర ప్రాంతంలోని లైట్ హౌస్ సమీపంలో సరుగుడు తోటలు నరికి.. ప్రతి రోజు ట్రాక్టర్ల ద్వారా ఈ బ్రిడ్జి మీద నుండి వాటిని తరలిస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అయితే అతడి వల్లే ఊరు ఊరంతా బాధ పడాల్సి వస్తోంది. అతని వ్యాపారం కారణంగా ఊళ్లో ఉన్న రవాణా మార్గం నాశనం అయింది.
మంగళ వారం ఉదయం ఇదే బ్రిడ్జిపై ట్రాక్టర్ లోడుతో అతడు వస్తుండగా వంతెన కుంగిపోయింది. సదరు వ్యక్తి ఇష్టానుసారంగా ఈ వంతెనపై లోడు ట్రాక్టర్లు తిప్పడం వల్లే బ్రిడ్జితో పాటు రోడ్డు కూడా కుంగి పోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కాట్రేనికోన మండలం మొల్లేటిమొగ ఉప్పు టేరుపై ఉన్న ఈ వంతెన కుంగి పోవడంతో గ్రామానికి రాకపోకలు స్తంభించిపోయాయి. మొల్లేటిమొగ, కొత్తపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు ఎక్కడకు వెళ్లాలన్నా ఈ బ్రిడ్జి కచ్చితంగా దాటాల్సిందే. అయితే ఉన్న ఒక్కగానొక్క వంతెన కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు.. ఇప్పటికైనా స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. భారీ వాహనాల ద్వారా సరుగుడు కర్రలు రవాణా చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని బ్రిడ్జిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ మొహమాటం కారణంగా ఊరుకోవడం వల్లే ఈ రోజు ఇంత పెద్ద సమస్య ఏర్పడిందని.. గ్రామస్థులు వాపోతున్నారు. ఉన్న ఏకైక వంతెనపై భారీ లోడ్ ట్రాక్టర్లు తిరగడం మూలంగానే ఈ బ్రిడ్జి కుంగి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ లోడ్ తో వెళ్లే వాహనాలు వద్దు..
వాహనాలు తీసుకొని వేరే మార్గం ద్వారా వెళ్లరాదని, వ్యాపారం కూడా చేస్కోలేడని పాపం అని ఊరుకుంటే... తమ పరిస్థితి అత్యంత దారణంగా అయ్యేలా చేశాడని గ్రామస్థులు చెబుతున్నారు. అతని స్వార్థం కోసం ఊరి ప్రజలందరినీ గ్రామంలోంచి అడుగు బయట పెట్టకుండా చేశాడని అంటున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి ఆస్పత్రికి వెళ్లాలన్నా, వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నారు. అలాగే ఈ బ్రిడ్జి పైనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ వాహనాలను వెళ్లనిచ్చేది లేదంటున్నారు. భారీ వాహనాల వల్ల పైవంతెన మరింత కుంగిపోయి కూలి పోయే ప్రమాదం ఉందని.. అందుకే భారీ వాహనాలను వెళ్లనివ్వమని పేర్కొంటున్నారు.