కాకినాడ జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బెంగాల్ టైగర్ దొరకకుండా అటు అధికారులను, ఇటు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది. మొన్నటివరకు ప్రత్తిపాడు మండలంలో 5 గ్రామాల ప్రజలను హడలెత్తించిన పెద్ద పులి శంఖవరం మండలంలో వజ్రకూటం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరించడంతో ఆ  గ్రామ ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఆటోను ఎటాక్ చేయడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు.


పట్టపగలే కత్తిపూడి నుండి వజ్రకూటం వెళ్లే రహదారి నిర్మానుష్యంగా మారింది. ఏ క్షణంలో పులి ఎటాక్ చేస్తుందోనని పొలం పనులకు కూడా వెళ్లడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం వజ్రకూటం, నెల్లిపూడి రిజర్వ్ ఫారెస్ట్ లోనే పులి సంచరిస్తూ ఉందని అంటున్నారు. సోమవారం మాత్రం పులికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని అధికారులు వివరించారు. పులి సంచరిస్తున్న చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


అధికారుల తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు
వజ్రకూటం గ్రామ ప్రజలు మాత్రం పులిని పట్టుకునే విషయంలో అటవీశాఖ అధికారుల తాత్సారం ప్రదర్శిస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఇటువంటి రోజుల్లో కూడా ఇరవై రోజుల నుండి జాప్యం ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఏ ప్రాంతంలో పులి తిరుగుతుందో కనిపెట్టాలని కోరుతున్నారు. అసలు అధికారులకు పులిని పట్టుకునే ఉద్దేశం ఉందా లేదా లేకపోతే మాకు చెప్పండి మేం చూసుకుంటామని అసహనం వ్యక్తం చేస్తున్నారు.


పనులు చేసుకోలేక పోతున్నాం
ఏ రోజుకారోజు కూలీనాలీ చేసుకుని జీవించే తాము పులి భయంతో పనులకు వెళ్ళలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి పాడి పశువుల దగ్గర నుండి కత్తిపూడి పాలు పట్టికేళ్లేందుకు భయంగా ఉండడంతో రెండు  రోజులుగా పాలు ఉండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు పులి విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పులిని పట్టుకొని ప్రజలు కాపాడాలని వేడుకుంటున్నారు.


దండోరా వేయించి అప్రమత్తం
మన ప్రాంతాల్లో పులి ఆచూకీ ఎక్కడ ఉందో తెలిసే వరకు ప్రజలెవరూ బయటకు రావద్దని వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు గ్రామంలో దండోరా వేయించారు. పులి నెల్లిపూడి, వజ్రకూటం సరిహద్దుల్లో ఉన్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.