AP DGP Rajendranath Reddy: అమలాపురం: వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ప్రణాళిక ప్రకారం కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసం సృష్టించారని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత నెలలో అమలాపురం అల్లర్లలో దగ్ధమైన మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని ఏపీ డీజీపీ సోమవారం పరిశీలించారు. అల్లర్లు జరిగిన 20 రోజుల అనంతరం రాష్ట్ర డీజీపీ అమలాపురంలో విధ్వంసం జరిగిన ప్రాంతాల పరిశీలనకు వచ్చారు. అయితే డీజీపీ పర్యటనను కవర్ చేసేందుకు మాత్రం మీడియాకు అనుమతి ఇవ్వలేదు.


అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్ల (Amalapuram Violence)లో పాల్గొన్న నిందితులు అందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన నిందితులు ఎవరిని వదిలే ప్రసక్తి లేదని, జరిగిన ఆస్తి నష్టానికి రెండింతలు నిందితులనుండి రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. అమలాపురం అల్లర్ల కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 268 మంది నిందితులను గుర్తించామని వారిలో 142 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.


వారిని పట్టుకోవడానికి ఏడు బృందాలు ఏర్పాటు
కోనసీమ జిల్లాల్లో విధ్వంసానికి పాల్పడిన వారిలో సగం మంది వరకు అరెస్ట్ చేశారు. మరో 126 మంది నిందితులు పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి ఏడు బృందాలని ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. అమలాపురం అల్లర్ల కేసులలో రాజకీయ పార్టీల పరంగా కార్యకర్తలను టార్గెట్ చెయ్యలేదని, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తించామని స్పష్టం చేశారు. అల్లర్ల సమయంలో కాల్పుల సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సంయమనం పాటించారని డీజీపీ చెప్పారు.
  
వాట్సాప్ మెస్సేజ్‌లతోనే విధ్వంసం..
సోషల్ మీడియా వేదికగా అమలాపురంలో విధ్వంసానికి ప్లాన్ చేశారని డీజీపీ తెలిపారు. వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ప్రణాళిక ప్రకారం విధ్వంసం సృష్టించారని, ఆస్తి నష్టం రికవరీపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. త్వరలోనే ఈ నివేదికను ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నిందితుల నుండి ఆస్తినష్టం రికవరీకి ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Also Read: Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో 135 మంది అరెస్ట్, హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న స్పెషల్  


Also Read: Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరో 3 రోజులు వానలు