Kakinada News: లక్ష్మీ థియేటర్‌ వద్ద మామలు ఉన్నార్రోయ్‌, కాస్త చూసుకుని రండి.. అని ఒకడు వాయిస్‌ మెసేజ్‌ పెడితే, భానుగుడి జంక్షన్‌ వద్ద రాసేస్తున్నారు.. ఇటువైపుగా ఎవ్వరూ వెళ్లకండి అంటూ మరొకడు టెక్స్ట్‌ మెసేజ్‌.. ఇదిలా ఉండగానే.. సర్పవరం జంక్షన్‌లో గంట సేపటి నుంచి బాబాయ్‌లు ఫైన్లు రాస్తున్నారు అలెర్ట్‌ అంటూ మరో వాయిస్‌ మేసేజ్‌.. ఇదంతా ఎవరు, ఎందుకు చేస్తున్నారా అని అనుకుంటున్నారా..!  వీళ్లంతా కాకినాడ కుర్రాళ్లు.


ఈ బ్యాచ్ గురించి తెలిస్తే... ఇలా ఎందుకు చేస్తున్నారో గుర్తిస్తే.. వీళ్లు చాలా ముదుర్లురా బాబు అనక మానరు. అవును మరి.. ఏ ఏరియాల్లో చెకింగ్‌లు చేస్తున్నారు, ఏ ఏరియాల్లో పోలీసులు ఉన్నారు, ఇలా ట్రాఫిక్‌ పోలీసులు నుంచి తప్పించుకునేందుకు ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశారు. ఎప్పటికప్పడు పోలీసులు ఎక్కడ మాటేశారో అప్డేట్స్‌ ఇస్తూ చివరకు అడ్డంగా దొరికి పోయారు.


ట్రాఫిక్‌ అప్డేట్స్‌ పేరుతో క్రియేట్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో 802 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తొంభైశాతం మంది మైనర్లే ఉన్నట్లు కాకినాడ ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. దీంతో అడ్మిన్లుగా వ్యవహరిస్తున్న కొంతమంది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు పోలీసులు.


వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా అప్‌డేట్స్‌..


కాకినాడ నగరంలో పోలీసుల పహారా సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ట్రాఫిక్‌ ఆంక్షలు అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వన్‌ వే పద్దతిలోనే కాకినాడలో రోడ్లుపై వాహనాలు తిరుగుతుంటాయి. ఇటీవల కాలంలో మైనర్లు ర్యాష్‌ డ్రైవింగ్‌ ఎక్కువై ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీసులు తనిఖీలను మరింత ఎక్కువ చేశారు. దీంతో కొందరు కుర్రాళ్లు పోలీసుల విస్తుపోయే స్కెచ్‌ ఒకటి వేశారు.


ట్రాఫిక్‌ అప్డేట్స్‌ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి కొందరిని అడ్మిన్లుగా చేశారు. దీంతో కాకినాడవ్యాప్తంగా 802 మంది సభ్యులుగా చేరిపోయారు. ఇందులో ఎక్కువగా మైనర్లే ఉన్నారు. ఈ గ్రూప్‌ సభ్యులు ఎవ్వరైనా పోలీసులు ఎక్కడ మాటు వేశారో వెంటనే గ్రూప్‌లో అప్డేట్‌ చేయడం, వాయిస్‌ మెసేజ్‌ లేదా టెక్స్ట్‌ మెసేజ్‌ చేయడం, వెంటనే అటువైపుగా వెళ్లేవారు అలెర్ట్‌ అయ్యి అక్కడ నుంచి వేరే మార్గంలో జారుకోవడం షరా మామూలు అయిపోయింది. అంతే కాదండోయ్‌ ఈ అప్ డేట్‌లో కూడా కాస్త కామెడీని పండిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు వేరే పేర్లు పెట్టి ఆ పేర్లతోనే అప్డేట్‌ ఇవ్వడం పోలీసులను గుర్తించారు.


నిబంధనలు అతిక్రమిస్తున్నారనే..


ఇటువంటి వాట్సాప్‌ గ్రూప్‌ల వల్ల సమాజానికి నష్టం ఏమీ కాదు కానీ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లుకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం జరిగిందని ట్రాఫిక్‌ సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. పోలీసుల తనిఖీలపై ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు సమాచారం అందిస్తున్నారని, అయితే గ్రూపులో ఉన్నవారిలో చాలామందికి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేవన్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం, అంతే కాకుండా రోడ్డు నిభందనలు ఉల్లంఘించడం వంటి పనులు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నందున వీరికి కౌన్సిలింగ్‌ నిర్వహించి వాట్సాప్‌ గ్రూప్‌ను డిలీట్‌ చేయించడం జరిగిందని వెల్లడించారు.