ఏపీలో 2 లక్షల 79  వేల కోట్లతో ప్రభుత్వం 'ఏపీ బడ్జెట్-2023' ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట వేసింది. మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్‌), పాఠశాల నిర్వహణ నిధి, సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వీడియో తరగతులు, ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్‌ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్‌లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్‌ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసింది.


అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు
అమ్మ ఒడి పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ.19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ వస్తోంది. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 'అమ్మ ఒడి' పథకం కోసం రూ.6,500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 


మన బడి నాడు-నేడు పథకానికి రూ.3,500 కోట్లు
మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద రూ.3,500 కోట్లు కేటాయించింది.


జగనన్న విద్యాకానుకకు రూ.560 కోట్లు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్‌ బెల్ట్‌, మాస్క్‌ల సెట్‌లతో కూడిన ‘టీచింగ్‌-లెర్నింగ్‌ మెటీరియల్‌’ను విద్యార్థి కిట్‌ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈసారి బడ్జెట్‌లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.


విద్యా దీవెనకు, వసతి దీవెనకు కేటాయింపులు ఇలా..
పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంజినీరింగ్‌, మెడికల్‌, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు. 
➥ 2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. 
➥ జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల  కేటాయింపు జరిగింది. 


పాఠశాల విద్య, ఉన్నత విద్యకు కేటాయింపులు ఎంతంటే? 
ఏపీ బడ్జెట్ 2023లొ పాఠశాల విద్యకు అధిక ప్రాధ్యాన్యం ఇచ్చారు. ఇదుకోసం రూ. 29,690 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయింపులు జరిపింది.


2 లక్షల 79 వేల కోట్లతో ఏపీ బడ్జెట్‌- రెవెన్యూ లోటు 22,316 కోట్లు..
ప్రగతికి అవసరమైన నాలుగు ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని 2023-24 సంవత్సరానికి ఏపీ బడ్జెట్ కోసం కేటాయింపులు చేసినట్టు పేర్కొన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సుస్థిర అభివృద్ధి, జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత సమాన అవకాశాలతో కూడీన  సుపరిపాలనకు దారి తీస్తుందన్నారు బుగ్గన. తమ పార్టీ మేనిఫెస్టోనే ఆ సూత్రాలకు అనుగుణంగా రూపొందించిందని గుర్తు చేశారు. అందుకే స్థిరమైన అభివృద్ధితో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు.
బడ్జెట్ 2023 కేటాయింపు మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..