US Warns Russia:


రష్యాపై ఫైర్..


రష్యన్ ఫైటర్ జెట్ అమెరికా డ్రోన్‌ను కూల్చేయడంపై అగ్రరాజ్యం మండిపడుతోంది. బ్లాక్‌ సీలో పడిపోయిన డ్రోన్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అటు రష్యా మాత్రం తాము కావాలని చేయలేదని చెబుతోంది. ఈ క్రమంలోనే అమెరికా రక్షణ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి, అనుమతి ఉన్న ప్రతి చోటా అమెరికన్ డ్రోన్‌లు ఎగురుతాయని తేల్చి చెప్పింది. రష్యా చేసిన పనిని తీవ్రంగా ఖండించింది. కావాలని చేసింది కాదని రష్యా పైపైకి చెబుతున్నా...ఇది కచ్చితంగా కుట్రేనని గట్టిగా వాదిస్తోంది అమెరికా. ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ విషయంలో రష్యా వైఖరిని తప్పుబడుతోంది అగ్రరాజ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తరహా ఘటనలు జరగటం వల్ల వివాదం ముదిరింది. 


"అంతర్జాతీయ చట్టాలను రష్యా ఖాతరు చేయడం లేదు. ఇలా దాడి చేసి కవ్వింపులకు పాల్పడుతోంది. ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా అప్రమత్తంగా ఉండండి. మాకు అనుమతి ప్రతి ఉన్న చోట డ్రోన్‌లు ఎగరేస్తాం. రష్యా తమ ఫైటర్‌ జెట్‌లను దుర్వినియోగం చేయకుండా కాస్త పద్ధతిగా నడుచుకుంటే మంచిది" 


- అమెరికా డిఫెన్స్ సెక్రటరీ


ఇదీ జరిగింది..


రష్యాకు చెందిన సుఖోయ్ -27 ఫైటర్ జెట్‌ అమెరికన్ డ్రోన్‌ను ఢీకొట్టింది. బ్లాక్‌ సీ గగనతలంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అమెరికన్ MQ-9 Reaper డ్రోన్ పూర్తిగా ధ్వంసమైంది. దీనిపై అమెరికా మిలిటరీ తీవ్రంగా స్పందించింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ మండి పడుతోంది. ఢీకొట్టే ముందు డ్రోన్‌పై పదేపదే ఫ్యూయెల్‌ చల్లిందని, కావాలనే ఆ డ్రోన్‌కు ఎదురుగా వచ్చి ఢీకొట్టారని ఆరోపిస్తోంది. అటు రష్యా మాత్రం అమెరికా ఆరోపణలను కొట్టి పారేస్తోంది. కావాలని చేసింది కాదని వెల్లడించింది. నిఘా ఆపరేషన్‌లో భాగమే ఫైటర్ జెట్‌ను పంపినట్టు తెలిపింది. "అమెరికాకు చెందిన మానవ రహిత డ్రోన్ ఉన్నట్టుండి అదుపు తప్పింది. మా ఫైటర్‌ జెట్‌ను ఢీకొట్టి నీళ్లలో పడిపోయింది" అని వివరిస్తోంది. కానీ అగ్రరాజ్యం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. అత్యవసరంగా సమావేశమవ్వాలని రష్యన్ అంబాసిడర్ అనటోలి అంటోనోవ్‌కు కబురు పంపింది. ఈ విషయమై రెండు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా జాగ్రత్త పడతామని అంటోనోవ్ చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా డ్రోన్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. రష్యాకు చెందిన ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోసారి ఇలాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. 


ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాలని రష్యా ప్రయత్నాలు చేయడంపై గతేడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రష్యా చేసే తీవ్రమైన తప్పుగా అమెరికా భావిస్తుందని బైడెన్ అన్నారు. యూరోప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ వద్ద రష్యా తన అణు సామర్థ్యాలపై సాధారణ కసరత్తులను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీనిపై బైడెన్ ఘాటుగా స్పందించారు.


రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగిస్తే అది చాలా తీవ్రమైన తప్పు అవుతుంది. రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుందా లేదా అనే దానిపై నేను ఏమీ చెప్పలేను. కానీ ఒక వేళ వినియోగిస్తే అది తీవ్రమైన పొరపాటు అవుతుంది.                     "




-   జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు



Also Read: Nobel Peace Prize 2023: నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్న ప్రధాని మోదీ? ఆశలు రేపుతున్న నార్వే కమిటీ వ్యాఖ్యలు