ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కరోనా సమయంలో పలు దేశాలకు వ్యాక్సిన్ అందించి మహమ్మారిని తరిమి కొట్టడంలో కీలకపాత్ర పోషించిన నేతగా నిలిచారు. అయితే ప్రధాని మోదీకి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు పెద్ద కారణమే ఉంది. ఇటీవల నోబెల్ బహుమతి కమిటీ భారత్‌లో పర్యటించింది. నార్వే నోబెల్ కమిటీ సభ్యులు ప్రధాని మోదీపై ప్రశసంల జల్లులు కురిపించడం నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. నోబెల్ కమిటీ వ్యాఖ్యలతో శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ గట్టి పోటీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.






నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్ కు వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. ప్రధాని మోదీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచంలో శాంతిని నెలకొల్పే అద్భుతమైన సామర్థ్యం ఉందని కితాబిచ్చారు. మోదీ లాంటి నేత శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే అన్నారు.


నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ ఏం చెప్పారంటే..
నోబెల్ శాంతి బహుమతి కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే ABP న్యూస్‌తో మాట్లాడారు. నోబెల్ శాంతి బహుమతి విషయంలో భారత్ నుంచి అధిక సంఖ్యలో నామినేషన్లు అందుతున్నాయన్నారు. పంచంలోని ప్రతిదేశ అగ్రనేతలు శాంతి కోసం  అవసరమైన కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత ప్రధాని మోదీ లాంటి వ్యక్తిపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడంలో మోదీ కీలకపాత్ర పోషిస్తారు, ఆయనకు ఆ సత్తా ఉందని అస్లే టోజే కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద యుద్దాలను సైతం మోదీ తన నాయకత్వ ప్రతిభ, విశ్వసనీయతతో ఆపడానికి ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దాంతో నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ గట్టిపోటీ ఇస్తారన్న వాదన మొదలైంది.


యుద్ధం ముఖ్యం కాదని భవిష్యత్తు అంతా శాంతితో ఉండాలని రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాల అధినేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారని అస్లే టోజే గుర్తుచేశారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. భారత్ ను చూసి ప్రపంచ దేశాలు ఎంతో నేర్చుకోవాలని, త్వరలోనే భారత్ సూపర్ పవర్ గా అవతరించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. 


2002లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌, 2009లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 2001లో ఐక్యరాజ్యసమితి, ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, 2012లో యూరోపియన్ యూనియన్, 2014లో భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌ లను ప్రతిష్టాత్మక శాంతి బహుమతి వరించింది. మదర్ థెరిసా మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.