ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో గురవారం మరోసారి ఈడీ విచారణకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఇప్పటికే మార్చి 11న ఓసారి ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. 16న విచారణకు రావాలని అప్పుడే ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆమె ఇవాళ రెండోసారి ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. 


రాజకీయాల్లో పెను సంచలనాలకు కేంద్రంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులను, అధికారులను, ఇతరులను సీబీఐ, ఈడీ విచారించింది. వారు ఇచ్చిన సమాచారం, వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు కవితను విచారిస్తున్నారు. ఇప్పటికే కవిత ఓసారి సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు రెండోసారి ఈడీ విచారణకు హాజరవుతున్నారు. 


సుప్రీంకోర్టులో పిటిషన్ 


మార్చి 11న విచారణకు హాజరైన కవిత.. అక్కడ విచారణ జరిగిన తీరుపై సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న కవిత అభ్యర్థను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. మార్చి 24న విచారిస్తామని తెలిపింది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను ఇంటికి వెళ్లే విచారించాలని... దీనికి విరుద్దంగా ఈడీ తనను ఆఫీస్‌కు పిలిచి విచారించారన్నారు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. వాటిని రద్దు చేయాలని అభ్యర్థించారు. 


ఈడీ నోటీసు రద్దు చేయాలన్న అభ్యర్థనతోపాటు ఈడీపై ఆరోపణలు కూడా చేశారు కవిత. నిందితులపై ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని తనను కూడా హింసించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే నోటీస్ రద్దు తోపాటు తనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. తన ఫోన్ కూడా ముందస్తు సమాచారం లేకుండా తన ఫోన్ కూడా ఈడీ సీజ్ చేసిందని తెలిపారు. 


మీడియా సమావేశం అని సమాచారం ఇచ్చి.. 


ఇవాళ ఈడీ విచారణకు వెళ్లనున్న కవిత మీడియాతో మాట్లాడనున్నారని అందరికీ సమాచారం వచ్చింది. కానీ దాన్ని రద్దు చేశారు. పది గంటలకు మీడియా సమావేశం పెట్టి తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇస్తారని అంతా అనుకున్నారు. ఆమె ఏం చెప్పనున్నారు. ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకురానున్నారనే ఆసక్తి అందరిలో కనిపించింది. కానీ ఆమె మీడియా ముందుకు రాలేదు. 


రామచంద్రపిళ్లై వాంగ్మూాలంతోనే అసలు చిక్కులు ! 


ఢిల్లీ లిక్కర్  స్కాంలో ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతున్న నిందితులందర్నీ దాదాపుగా అరెస్ట్ చేెశారు.  ఇప్పటికే స్కాం జరిగినప్పుడు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాతో పాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అభిషేక్ బోయినపల్లి సలహా పలువురు మద్యం వ్యాపారులు, ఆప్ సన్నిహితుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీని అని వాంగ్మూలం ఇవ్వడంతో  ... కవితకు చిక్కులు ఏర్పడ్డాయి. ఈ వాంగ్మూలం ఆధారంగానే ఈడీ కవితను ప్రశ్నిస్తున్నారు.  అయితే ఈ వాంగ్మూలాన్ని తాను వెనక్కి తీసుకుంటానని పిళ్లై ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


లిక్కర్ స్కాంలో కవితపై ప్రధాన ఆరోపణలు ఏమిటంటే ? 


ఢిల్లీలో లిక్కర్ పాలసీని మార్చి..  అక్రమాలకు చేసిన అవినీతి చేసిన కేసులో సౌత్ గ్రూప్ నుంచి కవిత ప్రధాన పాత్ర పోషించారని ఈడీ చెబుతోంది.  సౌత్ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహీంద్రూ, మాగుంట శ్రీనివాస్ రెడ్డికి 65 శాతం పార్టనర్ షిప్ ఉన్నట్లు పేర్కొంది. మనీశ్ సిసోడియా తరపున విజయ నాయర్ పని చేస్తున్నారన్న ఈడీ ఇండో స్పిరిట్ కు కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు ఫిబ్రవరి 28వ తేదీన ఇచ్చిన స్టేట్ మెంట్ లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు చెప్పినట్లు ఈడీ పేర్కొంది.ఢిల్లీ లిక్కర్ పాలసీ రూప కల్పనలో ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్, కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని ఈడీ పేర్కొంది. 2021 మార్చి 19, 20 తేదీల్లో కవితను విజయ నాయర్ కలిశారని, న్యూఢిల్లీలోని గౌరి అపార్ట్ మెంట్ లో జరిగిన సమావేశం తర్వాత అరుణ్ అభిషేక్ 2021 జూన్ లో హైదరాబాద్ లో ఐటీసీ కోహినూరులో విజయ్ నాయర్ దినేశ్ అరోరాతో సమావేశం అయ్యారని  ఈడీ పేర్కొంది.