TSPSC పేపర్ లీక్ వెనుక బీజేపీ కుట్ర ఉందని BRS నేత దాసోజు శ్రవణ్ సంచలన ఆరోపణ చేశారు. ఈ విషయంపై తమకు పక్కా సమాచారం ఉందన్నారు శ్రవణ్‌! తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్ కామెంట్స్‌ చేశారు. రహస్య ఎజెండాతో, కుట్ర పూరిత వైఖరితో, బండి సంజయ్ నేతృత్వంలో ఈ కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ దురదృష్ట సంఘటన అని, అది జరగడం బాధాకరమన్నారు శ్రవణ్‌. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది విచారణ జరుపుతోందన్నారు. ఈ ఆరోపణలపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్ చేశారు.


2014 నుండి 1లక్ష 34 వేల నియామకాలు జరిగాయి, కానీ ఒక్క అవకతవక కూడా జరగలేదన్నారు శ్రవణ్‌. ఎంతో పకడ్బందీగా ఈ TSPSCని తీర్చిదిద్దితే మిగతా రాష్ట్రాల కమిషన్లు వచ్చి అధ్యయనం చేశాయని గుర్తు చేశారాయన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో లీకేజీ వ్యవహారం జరిగినట్టు తమకు సమాచారం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇదొక నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఈ కుట్ర చేశారని అన్నారు.


లీకు వీరుల్లో మొదటివాడు ప్రవీణ్ అయితే, రెండవ వాడు రాజశేఖర్ రెడ్డని శ్రవణ్ అన్నారు. ఇందులో రాజశేఖర్ -బీజేపీ పార్టీకి చెందిన సామాజిక మధ్య విభాగాల్లో అత్యత క్రియాశీల వారియర్ అని ఆయన తెలిపారు. బండి సంజయ్ పార్లమెంట్ స్థానమైన కరీంనగర్ మల్యాలకి చెందిన వ్యక్తే ఈ రాజశేఖర్ అని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిగా పనిచేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వాన్నిఅప్రతిష్ట పాలు చేయాలని కుట్ర పన్నారని ఫైరయ్యారు. బీజేపీ క్షుద్ర రాజకీయాలు చేస్తోందని శ్రవణ్ విమర్శించారు. లీకేజీని రాజకీయ వ్యబిచారంతో పోల్చారయన.


రహస్య ఎజెండాతో యువతను రెచ్చగొట్టి తమ మైలేజీ పెంచుకోవాలని బీజేపీ కుట్ర పన్నిందని శ్రవణ్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో కిషన్ రెడ్డి,బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్ యూనివర్సిటీలో పేపర్ లీకైతే ఇప్పటివరకు సమాదానం లేదని గుర్తుచేశారు. గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎన్నోసార్లు పేపర్ లీక్ అయిందనీ, దానికి ఎలాంటి యాక్షనూ లేదని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటం ఆడుతున్నారని దాసోజు శ్రవణ్‌ అన్నారు. నిరుద్యోగ యువత బీజేపీ నాయకుల గల్లా పట్టుకొని అడగాలని పిలుపునిచ్చారు.


నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావడం బండి సంజయ్‌కి ఇష్టం లేదని మరో నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. బీజేపీ అంటేనే జుమ్లా పార్టీ అనీ, మధ్యప్రదేశ్ ,గుజరాత్ , ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నో ప్రశ్నాపత్రాలు లీకయ్యాయనీ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలని బిజెపి కుట్ర పన్నిందని ఎర్రోళ్ల అన్నారు. చట్టప్రకారం చర్యలు ఉంటాయని, నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.


AE పరీక్ష రద్దు చేస్తూ TSPSC ఉత్తర్వులు


ఇదిలా వుంటే, లీకైన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను రద్దు చేస్తూ TSPSC తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో పరీక్షలు జరిగే తేదీలను ప్రకటిస్తామని కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన పరీక్ష ఈనెల (మార్చి) 5న జరిగింది. మొత్తం 837 ఖాళీలుంటే, అందులో అసిస్టెంట్ ఇంజినీర్స్‌, మున్సిపల్  అసిస్టెంట్‌ ఇంజినీర్స్,  టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష జరిగింది. అయితే ఈ పేపర్ లీకైందని తేలిన తర్వాత, మార్చి 14 FIR నమోదు చేశారు. 15న పరీక్ష రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.