Godavari Weather: మొన్నటి వరకు గోదావరి జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు తలెత్తి చలి గాలులు వీస్తున్నాయి. గత నాలుగు రోజులుగా చలి పంజా విసురుతోంది. వణికిస్తున్న చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కాకినాడ, బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తుండడంతో ఈ తీవ్రత మరింత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావం ఉత్తర కోస్తాను ఆనుకుని ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కనిపిస్తోంది. ఒక్క సారిగా వాతావరణంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. 


వణికిస్తున్న చలి గాలులు... 


సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల పరిధిలో చలి గాలులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. వాతావరణం బాగా చల్లబడి  మబ్బులతోపాటు మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సాధారణంగా నవంబర్ మాసంలో చలి తీవ్రత పెరుగుతుంది. అయితే అల్పపీడన ద్రోణి కారణంగా ఈ తీవ్రత మరింత స్థాయిలో పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈనెలలో చలి తీవ్రత విపరీతంగా పెరగ‌్గా రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ కు వెళ్లేవాళ్లు, తెల్లవారుజామున స్నానం చేసే వారు, అయ్యప్ప స్వాములు కూడా చలి తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసం కావడంతో చాలా మంది తెల్లవారుజామునే స్నానం ఆచరిస్తారు. చలి తీవ్రతను తట్టుకోలేక వేడి నీటితో స్నానాలు ఆచరించాల్సిన పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు.


పడిపోతున్న ఉష్ణోగ్రతలు...


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణ కారణంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వాతావరణ ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పగటి పూట 29 నుంచి 34డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి సమయాల్లో మాత్రం 17 నుంచి 21 సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. ఈనెల 14వ తేదీన 33-19(గరిష్ట-కనిష్ట), 15న 33-18, 16న 33-18, 17న 34-18, 18న 34-17, 19న 33–17, 20న 32-19, 21వ తేదీన 30-16డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులు గా తుఫాన్ ప్రభావంతో చలితీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. 


ఇబ్బందులు పడుతున్న ప్రజలు...


ఎక్కువగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా పంటల ఆధారితమైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున లేచి వ్యవసాయ పనులు చేసుకునే రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. చలి గాలుల తీవ్రత మరింత పెరిగితే ఆక్వా రంగంలో కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కునే పరిస్థితి కనిపిస్తుందని ఆక్వా రైతులు చెబుతున్నారు. చెరువుల్లో కూలింగ్ స్థాయి బాగా పెరిగి రొయ్యలు మృత్యువాత పడే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయాల్లో చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. సమయంలో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రహదారులపై జనసంచారం పూర్తిగా తగ్గింది. చలి తీవ్రత కు వృద్ధులు బాగా ఇబ్బంది పడుతుండగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.