విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు ఉద్యమానికి 600 రోజులు  


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలంటూ అక్కడి ఉద్యోగులూ,కార్మికులూ ఏకధాటిగా చేస్తున్న ఉద్యమం మొదలై 600 రోజులు పూర్తయ్యాయి. కేవలం ఈ ఉద్యమాన్ని ప్రజలు ఏదో ఒక ప్రాంతానికో, కొంతమంది ఉద్యోగులకో సంబంధించిన అంశంగా చూడటంలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా ప్రజలు భావిస్తున్నారు. దీంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికుల పోరాటానికి ప్రజలు మద్దతు లభిస్తోంది దీనివల్ల రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని కార్మిక ,ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంలో నల్ల బ్యాడ్జీలు, జెండాలు ధరించి ర్యాలీ చేయనున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు. 


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజు ఏపీ పర్యటన 


ఈరోజు,రేపు ఏపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజుల రాష్ట్ర పర్యటన కోసం ఈ ఉదయం విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ NTPC ఆడిటోరియంలో జరిగే 'రోజగార్ మేళా' లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా పాల్గొనే కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం కార్యక్రమం అనంతరం సాయంత్రానికి పుట్టపర్తికి చేరుకుని, ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాత్రికి అక్కడ బస చేస్తారు. మరుసటి రోజు  బుధవారం ఉదయం పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం సాయంత్రానికి హైదరాబాద్ వెళ్తారు. కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి పాల్గొనే కార్యక్రమాల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు కూడా  పాల్గొంటారు. 


వారం రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ యాక్టివ్ కానున్న లోకేష్ 


వ్యక్తిగత పనుల నేపథ్యంలో గత వారం రోజులుగా ఏపీకి దూరంగా ఉన్న టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు నుంచి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీ కానున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో సొంత ఖర్చులతో ఆయన నిర్మించిన రోడ్డు పరిశిలించేందుకు లోకేష్ అక్కడికి త్వరలోనే వెళ్లే అవకాశం ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి .  .


ఉమ్మడి విజయనగరంలో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు 


పార్టీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యాలనే ఉద్దశ్యంతో ఒకొక్క జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న జనసేన ఈరోజు నుంచి ఉమ్మడి విజయ నగరం జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. దీనికి పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజక వర్గాల్లో ఈ రోజు నుంచి ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 13 న పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ జిల్లాలోని గుంకలాం గ్రామంలో పర్యటించి జగనన్న కాలనీల అంశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటించి అనేక అంశాలపై పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించనున్నట్టు పార్టీ శ్రేణులు స్పష్టం చేసాయి