రాష్ట్రంలో రైతుల పరిస్థితి అతలాకుతలం అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులను, ప్రతిపక్షాలను వేధిస్తున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన నష్టపోయిన రైతుల ఇబ్బందులు తెలుసుకుని వారి పక్షాన పోరాటం చేసేందుకు చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారని తెలిపారు.
నేడు, రేపు చంద్రబాబు పర్యటన..
అకాల వర్షానికి నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో పర్యటిస్తుండగా సాయంత్రం వరకు నిడమర్రులోని నష్టపోయిన వరిపొలాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఎన్వీఆర్ ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభమై వేగియమ్మపేటలో నష్టపోయిన పంటపొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. అక్కడినుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు కడియం మండలం చేరుకుని అక్కడ పంట నష్టాన్ని పరిశీలించి అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రిలో సెంట్రల్ జైలో ఉన్నటువంటి ఆదిరెడ్డి అప్పారావు, వాసులను కలుసుకుని అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి అక్కడినుంచి ఎయిర్‌పోర్ట్ కు వెళతారు. ఫైట్‌లో హైదరాబాద్ వెళతారు.
ఆదిరెడ్డి వాసు, అప్పారావును కలిసేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే ములాఖత్‌లో రేషన్ పెట్టి ఇద్దరే కలవాలి అంటూ ఆంక్షలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు జవహర్. తాను జైలు సూపరెంటెండ్‌ను కలవాలని వ్యక్తిగతంగా వెళ్తే అపాయిట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. దీన్ని బట్టి అధికారులు ఎంతగా భయపడుతున్నారో అర్ధమవుతుందన్నారు.
రాజమండ్రిలోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని, జైలులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, వాసును కలుసుకునేందుకు సాయంత్రం నాలుగు గంటలకు సెంట్రల్ జైలు వద్దకు చంద్రబాబు రాబోతున్నారని తెలిపారు జవహర్. వారిని కలవనీయకుండా ఉంచేందుకు సీఐడీ పోలీసులు వారిని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారని ఆరోపించారు. ఆదిరెడ్డి కుటుంబాన్ని ఎంతగా వేధించాలో అంతగా వేధిస్తున్నారని మండిపడ్డారు. నష్టం జరిగిన కుటుంబాన్ని నాయకుడు పరామర్శించాలంటే వీల్లేకుండా చేస్తున్నారి వాపోయారు. జైల్లో ఉన్న వారిని చంద్రబాబు కలవకుండా చేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.
నిరుద్యోగులను దగా చేస్తున్నారు
నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాఖలాలు లేవని అన్నారు జవహర్. గ్రూప్స్ కానీ, డీఎస్సీ కానీ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులను దగా చేస్తున్నారన్నారు. రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటే రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని 20వరకు తెరవకుండా ఆంక్షలు పెడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గతంలో జరిగిన డ్యామేజీలను పునరాలోచించి రైతులను ఆదుకుంటామన్నారు. చంద్రబాబు పర్యటనలో పొల్గొని రైతులు తమ ఇబ్బందులను తెలియజేస్తే వారి తరఫున ప్రతిపక్షంగా పోరాటం చేస్తామన్నారు.