Rayavaram In BR Ambedkar Konaseema District | రాయవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో బుధవారం నాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని లక్ష్మి గణపతి బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటితో పాటు మంటల నుంచి బయటకు రాలేక ఊపిరాడక తీవ్ర కాలిన గాయాలతో ఆరుగురు మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉండగా, మరో ముగ్గురు మగవారు ఉన్నారు.

Continues below advertisement


మందుగుండు తయారు చేస్తుండగా బాణసంచా కాలడంతో తయారీ కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడ దట్టమైన పొగ అలుముకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పరిస్థితి గమనిస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బాణసంచా తయారీ కేంద్రానికి చేరుకుమంటలు ఆర్పేందుకు శ్రమిస్తోంది. 




సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..


బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడుపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.




హోంమంత్రి అనిత దిగ్బ్రాంతి


విజయవాడ: కోనసీమ బాణసంచా పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కోనసీమ 
జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఆరుగురు చనిపోగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారుల తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని హోంమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. సహాయచర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంటలు అదపులోకి వచ్చినట్లు హోంమంత్రికి అధికారులు తెలిపారు. 


ఈ సీజన్లో ప్రతి ఏడాది అగ్ని ప్రమాదాలు..


అసలే బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేసేది రోజువారీ కూలీలు. ఇంట్లో పనిచేసే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబసభ్యులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు. ఓవైపు ఇంటి పెద్దను కోల్పోయామన్న బాధ, మరోవైపు పూట గడవటం కష్టంగా మారుతుంది. ప్రతి ఏడాది దీపావళికి ముందు బాణసంచా తయారీ కేంద్రాల్లో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. గతంలో సైతం ఏపీలోని క్రాకర్స్ తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు జరిగాయి. సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.