YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటి వరకు మీడియా ముందు విమర్శలు, సభలో ప్రశ్నించడం, మెడికల్ కాలేజీలు సందర్శించడానికి పరిమితమైన వైసీపీ ఇప్పుడు ఆందోళన బాట పడుతోంది. ప్రజలకు మేలు చేసే కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపిస్తున్న జగన్ పార్టీ ఈ నెల పది నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నివాసంలో తాడేపల్లిలో మంగళవారం వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ఆందోళనలు చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో ముఖ్యంగా మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని జగన్ అభిప్రాయపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ పదో తేదీ నుంచి అక్టోబర్ 22 వరకు వివిధ రూపాల్లో తమ నిరస తెలియజేయబోతున్నట్టు వెల్లడించారు.
అక్టోబర్ 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని వివరించనున్నారు. భవిష్యత్‌లో పేదవాడికి వైద్య సాయం అందకుండా పోతుందని కూడా తెలియజేయనున్నారు. 28వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ర్యాలీలు తీస్తారు. నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ధర్నాలు చేస్తారు. అనంతరం ప్రతి నియోజకవర్గంలో 50వే సంతకాలు సేకరిస్తారు. కోటి సంతకాలు, ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్‌కు తెలియజేస్తారు. దీని కోసం నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్‌ని కలుస్తారు.
అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నట్టు జగన్ ప్రకటించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరించాలని టార్గెట్ పెట్టారు. నియోజకవర్గ సమన్వయ కర్తలు రోజుకు రెండు గ్రామాలు సందర్శించాలని సూచించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు 28న నియోజకవర్గ స్థాయిలో అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని చెప్పారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో జరిగే ర్యాలీలో తాను కూడా పాల్గొంటానని పేర్కొన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాల దస్త్రాలను నవంబర్ 24న జిల్లాల నుంచి విజయవాడకు చేరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించాలని నేతలకు సూచించారు. తర్వాత వాటిని గవర్నర్‌కు ఇస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్దాలు చెబుతోందని అన్నారు. ప్రజలను వెన్నుపోటు పొడించిందని విమర్శించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, అరాచకం, అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. పాలనను పట్టించుకోని చంద్రబాబు కేవలం సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారని ధ్వజమెత్తారు. దోచుకో పంచుకో తినుకో విధానంలో చంద్రబాబు, ఆయన కుమారుడు, వారి బినామీల జేబులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.
వైసీపీ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా లిక్కర్ పాలసీ ఏర్పాటు చేస్తే నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారని జగన్ తెలియజేశారు. కల్తీ లిక్కర్ మాఫియా నడుస్తోందని వీళ్లకు అధికారులు సహాయం చేస్తున్నారని, పెదబాబు, చినబాబుకు ముడుపులు ఇచ్చి నాయకులు ఇల్లీగల్ నెట్‌వర్క్ నడిపిస్తున్నారని అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పద్దతి ప్రకారం కల్తీ మద్యాన్ని ఓ కుటీర పరిశ్రమలా నడిపిస్తున్నారని ఆన్నారు. ప్రభుత్వం బడుల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని తమ హయంలో నో అడ్మిషన్ బోర్డులు పెట్టామని గుర్తు చేశారు జగన్. రైతులకు ఎరువులు, పురుగుల మందులు అందడం లేదన్నారు.