East Godavari News: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద జరగనున్న మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమానికి నేతలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీన ప్రతినిధుల సభ, 28వ తేదీన మహానాడు బహిరంగ సభ జరగనుంది. వీటి కోసం వేర్వేరు వేదికలను సిద్ధం చేస్తున్నారు. 27న జరగబోయే ప్రతినిధుల సభకు 15 వేలకు మించి జనాభా హాజరు అవుతారని టీడీపీ పార్టీ అంచనా వేస్తోంది. అలాగే తరువాతి రోజు జరిగే మహానాడు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, తెలుగు దేశం అభిమానులు లక్షల్లో వస్తారని అంచనా. వీరి కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రతినిధుల సభ, మహానాడు కార్యక్రమాలకు వచ్చే అతిథులకు గోదావరి రుచులతో ఆత్మీయ ఆతిథ్యం పలకనున్నట్లు నాయకులు చెబుతున్నారు. 


ఎన్నికల శంఖారావం పూరించనున్న టీడీపీ


ఎన్నికలు ఏడాది కాలంలో రానున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో మహానాడు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా వరుస విజయాలు సాధించి, మంచి జోష్ మీద ఉన్న టీడీపీ.. మహానాడు నుండే ఎన్నికల శంఖారావం పూరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం రాజకీయ కేంద్రం లాంటిది. అక్కడి నుండే మహానాడు ద్వారా ఎన్నికల శంఖారావం పూరించడం శుభసూచకమని టీడీపీ నేతలు అంటున్నారు. ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ నిర్వహిస్తున్న ఈ మహానాడు ఎంతో ప్రత్యేకమైనదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు చెబుతున్నారు.


ఈసారి టీడీపీ మహానాడు నిర్వహణకు 15 కమిటీలను ఏర్పాటు చేశారు. మహానాడు ఆహ్వానాల కమిటీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు పలువురు సభ్యులు ఉన్నారు. తీర్మానాల కమిటీలో యనమన రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్.ఏ. షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. మహానాడుకు సంబంధించిన అన్ని కమిటీల్లో కలిపి మొత్తం 200 మంది సభ్యులు ఉన్నారు.


ఈ సారి మహానాడు టీడీపీకి అన్ని విధాలా దిశానిర్దేశం చేయబోతోంది. ముఖ్యంగా రాజకీయంగా పొత్తులు కీలకంగా మారుతున్న తరుణంలో జనసేన, బీజేపీతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలన్నది పార్టీ అధిష్ఠానం మహానాడులోనే నిర్ణయించనుంది. అలాగే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో పొత్తులు, సీట్ల పంపకాలు, సీఎం సీటు విషయంలోనూ క్లారిటీ వచ్చేసినట్లే. దీంతో మహానాడులో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకని ప్రకటన చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేస్తున్నారు. జనసేనతో పొత్తుపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే కలిసి వస్తే బీజేపీతో కూడా పొత్తు ఉంటుందని లేదంటే కేవలం జనసేనతోనే ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ టీడీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో, ఎలాంటి తీర్మానాలు చేయనుందో వేచి చూడాల్సి ఉంది.