Train Service Disruption: కాకినాడ జిల్లా సామర్లకోట - వేట్లపాలెం రైల్వే స్టేషన్ల మధ్య శనివారం మధ్యాహ్నం విద్యుత్ లైన్ల మధ్య సాంకేతిక లోపం సంభవించింది. దీనివల్ల విశాఖపట్నం - విజయవాడ ప్రధాన మార్గంలోని పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. సామర్లకోట రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు నిలిచిపోయాయి. హుస్సేన్ పురం - గూడపర్తి మధ్య వెంకటరామా ఆయిల్ పరిశ్రమ సమీపంలో ఓ వానరం రైళ్లకు విద్యుత్ సరఫరా చేసే తీగపై పడి మృతి చెందింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈక్రమంలోనే విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే అప్ లైన్ లో రైళ్లకు అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ కారణంగా సామర్లకోట రైల్వే స్టేషన్ తో పాటు అవుటర్ లో కొన్ని రైళ్లను నిలిపి వేశారు. ఇంజినీరింగ్ అధికారులు సమస్య ఏంటో గుర్తించి.. మృతి చెందిన కోతిని కిందకు తీసుకువచ్చారు. అనంతరం మరమ్మతులు చేపట్టి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఆపసోపాలు
ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3.06 గంటలకు సమార్లకోట రావాల్సిన విశాఖపట్నం - విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు 3.56కు వచ్చింది. సమస్యల వల్ల రెండు గంటల పాటు నిలిచిపోయింది. అలాగే బెంగళూరు - భువనేశ్వర్ (18463) ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు 3.33 గంటలకు రావాల్సి ఉండగా... అరగంట ఆలస్యంగా 4.05 గంటలకు వచ్చింది. ఈ రైలును సాయంత్రం 5.54 గంటలకు పంపించారు. హావ్ డా - ఎస్ఎంవీటీ బెంగళూరు (12863) సూపర్ ఫాస్ట్ రైలు మధ్యాహ్నం 2.34కు రావాల్సి ఉండగా ఔటర్ లో నిలిపి వేశారు. దీంతో సాయంత్రం 5.10కి వచ్చి, 6.02 గంటలకు వెళ్లంది. తర్వాత తిరుమల ఎక్స్ ప్రెస్, చెన్నై మెయిల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైళ్లన్నీ రెండు గంటలకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులతో పాటు స్టేషన్ లో వేచి చూస్తున్న పలువురు తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఇంటర్ లాక్ పనుల వల్ల పలు రైళ్లు రద్దు..
ఖాజీపేట - కొండపల్లి, చింతల్ పల్లి - నెక్కొండ స్టేషన్ మధ్యలో జరుగుతున్న మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రద్దైన ట్రైన్స్ ఇవే
ఖాజీపేట-డోర్నకల్ (07753/07754), విజయవాడ - డోర్నకల్ (077555/07756), విజయవాడ - గుంటూరు (07464/07465), భద్రాచలం రోడ్డు - సికింద్రాబాద్ (17660/17659), విజయవాడ్ - సికింద్రాబాద్ (12713/127714) ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా ఖాజీపేట - తిరుపతి (17091/17092) రైళ్లు ఈనెల 23, 30 జూన్ 6వ తేదీల్లో, మచిలీపట్నం - సికింద్రాబాద్ (07185/07186) రైళలను ఈనెల 21, 28, జూన్ 4వ తేదీల్లో రద్దు చేశారు.
సిర్పూర్ టౌన్ - భద్రాచలం (17034) ఈనెల 20వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వరంగల్ - భద్రాచలం మధ్య,భద్రాచలం - సిర్పూర్ (17033) ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు భద్రాచలం - వరంగల్ మధ్య పాక్షక్షికంగా రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం - ముంబై ఎల్టీటీ (18519) ఈనెల 21వ తేదీ నుంచి జూన్ 7 వరకు వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది. షాలిమార్ - సికింద్రాబాద్ (22849) ఈనెల 24, 28, జూన్ 4వ తేదీల్లో వయా సికింద్రాబాద్, పగిడపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. యశ్వంత్ పూర్ -టాటా నగర్ (18112) ఈనెల 21, 28, జూన్ 4వ తేదీల్లో వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. హైదరాబాద్ - షా,లిమార్ (18046) ఈనెల 28, జూన్ 7వ తేదీల్లో వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా నడుస్తుంది.