Nara Bhuvaneshwari sensational comments at Rajahmundry Jail:
చంద్రబాబు నిర్మించిన జైల్లోనే ఆయనను కట్టిపారేశారంటూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రత గురించి మాట్లాడుతూ.. అధికారులు భద్రత కల్పిస్తున్నా తనకు ఇంకా భయంగా ఉందన్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. తనలో సగ భాగాన్ని జైల్లో వదిలేసి వచ్చినట్లు ఉందన్నారు. ప్రజల హక్కు, స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తిని వేధిస్తున్నారని.. మీరంతా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇది కుటుంబానికి, టీడీపీ క్యాడర్ కు, పార్టీ శ్రేణులకు ఇది కష్టకాలం అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఎన్నటికీ పార్టీ కోసం నిలుస్తుందన్నారు.


గతంలో ఏరోజు సెక్రటేరియట్ కు కూడా మీరు రాలేదు, ఈరోజు జైలుకు వచ్చారని, ఈ పరిస్థితిపై మీడియా ఆమెను అడిగారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. కానీ చంద్రబాబు భార్యగా జైలుకు వెళ్లి ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఆయన సెక్యూరిటీపై ఇంకా భయంగా ఉందన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తికి నెంబర్ 1 సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయన చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించిన ఆమె.. తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పినట్లు తెలిపారు. జైలులోనూ ప్రజల గురించే చంద్రబాబు ఆలోచిస్తున్నారని, ఎప్పుడు బయటకు వస్తాను ప్రజలకు సేవ చేయాలని అన్నారని భువనేశ్వరి చెప్పారు.


చంద్రబాబును కలిసిన కుటుంబసభ్యులు.. 
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుని కుటుంబసభ్యులు కలిశారు. చంద్రబాబును సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి జైలుకు వెళ్లి కలిసి పరామర్శించారు. వారికి 45 నిమిషాలు మాట్లాడేందుకు అధికారులు సమయం కేటాయించారు. కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించడంతో భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురికే ములాఖత్ కు ఛాన్స్ ఇవ్వడంతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ కు నిరాశే ఎదురైంది. వారు సైతం చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు వెళ్లారు. కానీ టీడీపీ అధినేతకు కలిసేందుకు వారికి అవకాశం రాలేదు.