Janasena leaders Meet Nara Lokesh:

  ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన, టీడీపీ మధ్య దూరం మరింత తగ్గిపోయింది. అధికారికంగా పొత్తులో లేకపోయినా రెండు పార్టీలు ఒకేమాటపై నడుస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ ని కలసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన నేతలు. కందుల దుర్గేష్, ప్రియా సౌజన్య, వేగుళ్ల లీలాకృష్ణ.. మరికొందరు జనసేన నేతలు కలసి రాజమండ్రి వెళ్లి నారా లోకేష్ ని పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, వైసీపీ దుర్మార్గపాలనపై కలసి పోరాడుదామని చెప్పారు. చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోందని, స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని, రాష్ట్రంలో జగన్ అరాచకపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టును ఖండించిన వారిపై వైసీపీ నేతలు  విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం అవుతుందన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు మద్ధతు తెలిపి, బంద్ లో పాల్గొన్నందుకు జనసేన నేతలు, కార్యకర్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. 


పవన్ మద్దతు..
చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కల్యాణ్ ఏపీకి వచ్చారు. అయితే ఆయన జనసేన పార్టీ కార్యక్రమాలకోసమే ఏపీకి వచ్చానని, దారిలో తనను అనవసరంగా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. చంద్రబాబుకి రిమాండ్ ఖరారైన తర్వాత కూడా పవన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ వైఖరిని ఖండించారు. అరెస్ట్ లతో ప్రజలలో ఉన్న అసంతృప్తిని అడ్డుకోలేరని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కచ్చితంగా బుద్ధి చెబుతామన్నారు. చంద్రబాబుకి ఇప్పుడు ఎప్పుడూ తాను మద్దతుగా ఉంటానన్నారు పవన్. నారా లోకేష్ కి ఫోన్ చేసి మరీ పరామర్శించారు. తన మద్దతు తెలిపారు. లోకేష్ కి తాము అండగా ఉంటామన్నారు. చంద్రబాబు జైలుకి వెళ్లిన సందర్భంలో లోకేష్ మరింత ధైర్యంగా ఉండాలని చెప్పారు. 


పవన్ కి లోకేష్ కృతజ్ఞతలు.
ఆ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన నారా లోకేష్.. కష్టకాలంతో తమకు అండగా ఉన్న పవన్ కల్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. తనకు సోదరుడిలా ఆయన ధైర్యం చెప్పారన్నారు. దీంతో అటు జనసేన నేతలు కూడా సంబరపడిపోతున్నారు. లోకేష్, పవన్ ని సోదరుడిగా భావించి మాట్లాడటాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో జనసేన నుంచి పోస్టింగ్ లు పడ్డాయి. దీంతో జనసేన, టీడీపీ ప్యాచప్ పూర్తయిందనే సంకేతాలు వెలువడ్డాయి. దాదాపుగా పొత్తులు వ్యవహారం కూడా ఖాయమైనట్టే తేలిపోయింది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 


పవన్ కలవడమే తరువాయి..
పవన్ కల్యాణ్ సూచన మేరకే జనసేన నేతలు రాజమండ్రిలో లోకేష్ ని కలిశారు. తమ మద్దతు తెలిపారు. భవిష్యత్తులో కూడా జనసేన, టీడీపీకి మద్దతు తెలుపుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక లోకేష్ తో పవన్ భేటీ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. త్వరలో పవన్ కల్యాణ్ కూడా నారా లోకేష్ ని కలుస్తారని తెలుస్తోంది. ఇక పవన్ వారాహి నెక్స్ట్ షెడ్యూల్ లో కూడా చంద్రబాబు అరెస్ట్ అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుందని అర్థమవుతోంది. మరోసారి ఏపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో పవన్ విరుచుకుపడతారని అంటున్నారు.