మీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు.. ఇప్పటికే రాయలసీమ, పశ్చిమగోదావరి జిల్లాల ప్రాంతంలో చంద్రబాబు టూర్ సక్సెస్ అవ్వడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాపై దృష్టిసారించారు.. ఇందులో భాగంగా విశాఖనుంచి నేరుగా రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు ఈ రోజు నుంచి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం నుంచి తన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కోనసీమ జిల్లాలో మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు (16 నుంచి 18 వరకు) చంద్రబాబు పర్యటన చేయనున్నారు.
మూడు నియోజకవర్గాల్లో బిజీ షెడ్యూల్..
ఎన్నికల నగరా మరికొన్ని నెలల్లో మ్రోగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన స్పీడ్‌ను మరింత పెంచారు. ఇందులో భాగంగా బిజీ బిజీ షెడ్యూల్‌తో ప్రజల్లోకి దూసుకుపోనున్నారు. కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గం నుంచి ప్రారంభం అయ్యే టూర్‌లో అన్నివర్గాలకు కలుసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ముందుగా మండపేట నియోజకవర్గంలోని 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. కొబ్బరి, వరి, ఉద్యాన రైతులతో సమావేశమై పంటలు, వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులపై చర్చించనున్నారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా కలువపువ్వు సెంటర్‌కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మండపేటలోని నైట్ హాల్ట్ చేసి మురుసటి రోజు కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో పర్యటించనున్నారు. జన్నాడ వారధి మీదుగా రావులపాలెం చేరుకుని రోడ్‌షో అనంతరం రావులపాలెంలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గననున్నారు.
అక్కడినుంచి అమలాపురం చేరుకుని అమలాపురంలో నైట్‌హాల్ట్ చేయనున్నారు. అమలాపురం పట్టణంలో రోడ్‌షో అనంతరం గడియారస్తంభం సెంటర్‌లో పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు..
భారీ ఏర్పాట్ల దిశగా తెలుగు తమ్ముళ్లు
కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌ల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా సభ విజయవంతం అయ్యే దిశగా ఇప్పటికే మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి పర్యటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విజయవంతం అయిన నేపథ్యంతోపాటు వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా కోనసీమలోనే పర్యటించారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు పర్యటన కోనసీమలో మంచి వైబ్రేషన్స్ తీసుకువచ్చి తెలుగు తమ్ముళ్లల్లో మరింత జోష్ నింపేవిధంగా చేయాలని తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.