75th Independence Day: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఇంటింటా ప్రతి సామాన్యుడు సైతం జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని గత నెలలో ప్రకటించింది. ‘ హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమంలో తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను అమరవీరుల త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఎగురవేస్తున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలకు స్వాతంత్రోద్యమంతో సంబంధం ఉన్నట్లే.. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది.
కోనసీమ జిల్లాకు ఆగస్టు 15 చాలా ప్రత్యేకం..
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక గ్రామానికి స్వతంత్ర మహా సంగ్రామంలో ఏకంగా 22 మంది పాల్గొన్న ఘనత ఉంది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని అసువులు బాసిన వారి త్యాగాలకు గుర్తుగా ఆ ఊరిలో ఓ స్థూపాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దినోత్సవ వేడుకల్లో ఆగస్టు 15 వ తేదీన ఆ గ్రామ ప్రజలు స్వాతంత్ర్యోద్యమ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన యోధులను, అమర వీరుల సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. దేశానికి బ్రిటీష్ వారి చెర నుంచి విముక్తి కల్పించిన మహనీయులు కోనసీమ జిల్లాలో అధికంగా ఒక్క నాగుల్లంక గ్రామంలో ఉన్నారని గ్రామస్తులు ఎంతో గొప్పగా చెబుతారు.
భావితరాలకు స్ఫూర్తిని రగిలించేలా స్థూపం...
ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో పాల్గొన్న వారి స్ఫూర్తిని భావి తరాలు పొందేలా గ్రామంలో స్మరక స్థూపాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది అక్కడే స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటారు గ్రామస్తులు. అప్పటి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యజీ వేమా స్థానికంగా ఉండే కాలువపై వంతెన నిర్మించి ఆ వంతెనకు స్వాతంత్ర్య సమరయోధుల వారధిగా నామకరణం చేశారు. ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీన స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకోవాలని ఇటీవల పిలుపునిచ్చారు. అందులో భాగంగా హర్ ఘర్ తిరంగా లో పాల్గొని నాగుల్లంక గ్రామస్తులు సైతం తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ భక్తిని చాటుకుంటున్నారు. సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని చెబుతున్నారు.
Also Read: India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?
Also Read: Har Ghar Tiranga: జాతీయ జెండా పాడైతే ఎలా డిస్పోస్ చేయాలో తెలుసా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి