Har Ghar Tiranga: 

హర్ ఘర్ తిరంగా మొదలైంది..

దేశవ్యాప్తంగా హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం మొదలైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇల్లు, కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలన్న ప్రధాని మోదీ పిలుపు సూచనను అందరూ పాటిస్తున్నారు. ఎక్కడ చూసినా జాతీయ జెండా రెపరెపలాడుతోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ హర్ ఘర్ తిరంగా కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడికీ, త్రివర్ణ పతాకంతోఅనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదో ఫార్మల్‌గా జెండా ఎగరేశామంటే ఎగరేశాం అన్నట్టుగా కాకుండా, ఈ త్రివర్ణ పతాక స్ఫూర్తిని గుండెల నిండా నింపుకోవాలనేదే ప్రధాన ఉద్దేశం. అందరిలో దాగున్న దేశభక్తిని తట్టి లేపింది ఈ ఉద్యమం. అదే సమయంలో త్రివర్ణపతాకానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ తరానికీ తెలియజేస్తోంది. ఇదే కాదు. సోషల్ మీడియాలోనూ అందరూ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలనీ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. 

జెండా ఎగరేయటం ప్రాథమిక హక్కు..

నిజానికి జాతీయ జెండాను ఎప్పుడు పడితే ఎగరేయకూడదన్న నిబంధన ఉండేది. ఇలా ఎవరు చేసినా అనుమతించే వారు కాదు. అయితే..ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు దశాబ్దం పాటు దీనిపై విచారణ కొనసాగింది. చివరకు 2004లో జనవరి 23న సుప్రీం కోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. జెండా ఎగరేయటం ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పింది. రాజ్యాగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఈ హక్కు అందరికీ ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి నుంచి జెండా ఆవిష్కరణకు సంబంధించిన పరిమితులన్నీ తొలగిపోయాయి. 2002లో తీసుకొచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆధారంగా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ జెండా ఎగరేయాలి. జాతీయ గౌరవాన్ని కాపాడుతూనే జెండా ఎగరేసేందుకు కొన్ని నిబంధనలూ పొందుపరిచారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

పౌరులు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు...ఎప్పుడైనా సరే జాతీయ జెండాను ఎగరేయచ్చు. టైమింగ్స్ విషయంలోనూ ఎలాంటి ఆంక్షలు లేవు. ఫ్లాగ్‌ కోడ్ ప్రకారం...దేశంలో ఏ ఇంటిపైన అయినా..జాతీయ జెండా రెపరెపలాడొచ్చు. రాత్రైనా, పగలైనా వాటిని ఎగరేయొచ్చు. అయితే గతేడాది డిసెంబర్‌లో ఫ్లాగ్‌ కోడ్‌లో ఓ చిన్న మార్పు చేశారు. కేవలం ఖాదీ, కాటన్, సిల్క్‌ జెండాలనే కాకుండా...పాలిస్టర్ జెండాలను కూడా ఎగరేయొచ్చని అనుమతినిచ్చారు.  జెండా ఎక్కడ ఎగరేసినా సరే..అది పూర్తిగా కనిపించాలి. సరైన చోటులో దాన్ని ఉంచాలి. డ్యామేజ్ అయిన జెండాను ఎగరేయకూడదు. అలాగే జెండాను తిరగేసి ఎగరేయటమూ నేరమే. కాషాయ రంగు తప్పకుండా పైన ఉండేలా ఎగరేయాలి. జాతీయ జెండా ఎగిరే పోల్‌ చివరన పూలు కానీ, ఇతరత్రా ఎంబ్లెమ్‌లు కానీ ఉంచకూడదు. కేవలం జెండా మాత్రమే కనిపించాలి. జాతీయ జెండాకు పక్కన, దానికి మించిన ఎత్తులో మరే జెండా ఎగరకూడదు. పొరపాటున త్రివర్ణ పతాకం చినిగిపోతే..ఎక్కడ పడితే అక్కడా దాన్ని పారేయ కూడదు. పబ్లిక్‌ ప్లేస్‌లో కాకుండా ప్రైవేట్‌గా దాన్ని కాల్చివేయాలి. అది కూడా అతి జాగ్రత్తగా. జాతీయ జెండాను ఎప్పుడూ మట్టిలో పాతి పెట్టకూడదని గుర్తుంచుకోవాలి. 

Also Read: Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

Also Read: Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి