Salman Rushdie: 


ఇదెంతో బాధాకరమైన వార్త..


కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ..వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం... ఆయన ఓ కన్ను కోల్పోయినట్టు తెలుస్తోంది. కత్తితో తీవ్రంగా పొడవటం వల్ల కాలేయం కూడా తీవ్రంగా గాయపడినట్టు వైద్యులు చెబుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం...రష్దీ ఏజెంట్ ఒకరు ఈ వివరాలు వెల్లడించినట్టు సమాచారం. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని
మాట్లాడలేకపోతున్నారనీ వివరించారు. "ఇదెంతో బాధాకరమైన వార్త. సల్మాన్‌ రష్దీ ఓ కన్ను కోల్పోతారేమో. అంత తీవ్రంగా గాయపడ్డారు. భుజంపె నరాలు కూడా గాయపడ్డాయి. కాలేయంపైనా కత్తి పోట్లు ఉన్నాయి" అని చెప్పారు రష్దీ ఏజెంట్. ఈ దారుణం వెనక ఎవరున్నారన్నది పోలీసులు విచారణ చేపడుతున్నారు. 24 ఏళ్ల కుర్రాడు ఈ దాడి చేసినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. న్యూజెర్సీకి చెందిన హది మతర్ ఈ పని చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న్యూయార్క్ లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చర్ ఇచ్చేందుకు  సిద్ధమవుతుండగా ఆయన వైపు దూసుకొచ్చిన ఓ వ్యక్తి సల్మాన్ రష్దీపై కత్తితో  దాడి చేశాడు. అమెరికా న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చర్ ఇచ్చేందుకు రష్దీ హాజరయ్యారు. కత్తి పోట్లకు గురైన రష్దీ స్టేజిపైనే కుప్పకూలిపోయారు. గాయాలపాలైన ఆయన్ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. 


వివాదాస్పదమైన ఆ రచన..


రష్దీ రచించిన మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ నవలకు 1981లో బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. దీంతో ఆయన ఫేమస్‌ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ది సాతానిక్‌ వెర్సెస్‌‌ నవల వివాదాలకు మూలమైంది. అప్పటి నుంచి ఆయనకు  బెదిరింపులు మొదలయ్యాయి. మతాన్ని కించపరిచేలా ఈ నవల ఉందని 1988లో ఇరాన్‌ ఈ నవలను నిషేధించింది.  దాడి చేసిన వ్యక్తి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్ నగరానికి 100 కి.మీ దూరంలో ఉన్న చౌతాక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ దాడి జరిగింది. దుండగుడు ఒక్కసారిగా వెనుక నుంచి దాడి చేయడంతో రష్దీ మెడ భాగంలో గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సల్మాన్ రష్దీతో పాటు పక్కనున్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే రష్దీ నేలపై కుప్పకూలిపోయారు. స్టేజ్ కిందనున్న వారు రచయితకు సాయం చేసేందుకు ప్రయత్నించారు.


ఎంతో షాక్‌కు గురి చేసింది: వైట్‌ హౌజ్ 


ఈ ఘటనపై శ్వేససౌధం స్పందించింది. ఇదెంతో షాక్‌కు గురి చేసిందని తెలిపింది. "ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన గాయపడిన వెంటనే సాయం చేసేందుకు ముందుకొచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అని వైట్‌హౌడ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లీవన్ వెల్లడించారు. "150 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడని సంఘటన  ఇది. అన్ని వర్గాల వారినీ ఒక్కటి చేయాలనే లక్ష్యంతోనే ఈ సంస్థను స్థాపించాం. కానీ ఈ ఘటన మమ్మల్ని భయానికి గురి చేసింద" అని చౌతాక్వా ఇన్‌స్టిట్యూషన్‌ ప్రెసిడెంట్ మైకేల్ హిల్ అన్నారు. 


Also Read: Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి


Also Read: పొదుపు సంఘం నుంచి డబ్బులు తీసుకొని భర్త హత్యకు భార్య కుట్ర- నల్లగొండలో దారుణం