నల్లగొండ జిల్లా మనుగోడు మండలంలోని ఊకొండి చౌరస్తా వద్ద ఈ నెల 4న జరిగిన కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. భార్యే ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు తేల్చారు. నార్కట్‌పల్లి మండలం బి.వెల్లెంల గ్రామంలోని హైస్కూల్‌లో పని చేస్తున్నాడు చింతపల్లి బాలకృష్ణ. అదే స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం వండిపెట్టే సంధ్యతో అతనికి స్నేహం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
బాలకృష్ణ, సంధ్య మధ్య ఏర్పడిన సంబంధం మరింత బలపడింది. ఆమె భర్త లేకుంటే ఇద్దరు మరింత హ్యాపీగా ఉంటామనుకున్నాడు బాలకృష్ణ. తనను పెళ్లి చేసుకుంటే పొలంరాసిస్తానని సంధ్యకు మాట ఇచ్చాడు.
బాలకృష్ణ మాటలు నమ్మిన సంధ్య తన భర్త హత్యకు ప్లాన్ చేసింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌కు చెందిన రామస్వామి, అదే ప్రాంతానికి చెందిన రత్నాల వెంకటేశ్, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వింజమూరుకు చెందిన పోల్ గిరిబాబు, బి.వెల్దంల గ్రామానికి చెందిన మహ్మద్ మొయినొద్దీన్‌తో మొదట ప్లాన్ చేశారు. బాలకృష్ణ వాళ్లకు మూడు లక్షలు ఇచ్చి సంధ్య భర్త లింగస్వామిని హత్య చేయాలని పురమాయించాడు. అయితే రోజులు గడుస్తున్నా హత్య చేయకపోయేసరికి డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు బాలకృష్ణ. ఇచ్చిన డబ్బులకు ప్రామిసరీ నోట్, బ్యాంకు చెక్‌బుక్ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ప్లంబర్‌గా పని చేస్తున్న యూసుఫ్‌ను కలిసిన బాలకృష్ణ ఈ విషయం గురించి చెప్పాడు. అయితే తనకు తెలిసిన వ్యక్తులు ఉన్నారని యూసఫ్ చెప్పడంతో మరోసారి లింగస్వామి హత్యకు ప్లాన్ చేశాడు బాలకృష్ణ. హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ జహంగీర్ పాష, చిలకలూరిపేటకు చెందిన పఠాన్ ఆసిఫ్‌ఖాన్‌తో కలిసి 12 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఇందులో లక్షరూపాయలను సంధ్య సర్దించింది. మహిళా సంఘంలో డబ్బులు తీసుకొని బాలకృష్ణకు ఇచ్చింది.
బాలకృష్ణతో ఒప్పందం చేసుకున్న గ్యాంగ్ బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసింది. ఓ పాత బైక్‌ను కూడా కొనుగోలు చేసింది. ఈ నెల4న సాయంత్రం లింగ స్వామిపై యూసుఫ్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. మూడు రౌండ్ల కాల్పులకు లింగస్వామి కిందపడిపోయాడు. ఆయన్ని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు.
హత్య తర్వాత వివిధ ప్రాంతాలకు పారిపోయిన 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 9 ఫోన్లు, 4,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు వీళ్లే:- బాలకృష్ణ, సంధ్య, అబ్దుల్ రెహమాన్, మహ్మద్ జహంగీర్ పాష అలియాస్ బాబు, పఠాన్ ఆసిఫ్ ఖాన్. మరో నిందితుడు యూసుఫ్ పరారీలో ఉన్నాడు. వీళ్లతోపాటు రామస్వామి, రత్నాల వెంకటేష్, పోల్ గిరిబాబు, మహ్మద్ మొయినొద్దీన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.100 కోట్ల డ్రగ్స్ స్వాధీనం, అక్కడ తొలిసారిగా ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత
Also Read:ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దుండగుడు