Salman Rushdie : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ(75)పై హత్యాయత్నం జరిగింది. ఓ వ్యక్తి సల్మాన్ రష్దీపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రష్దీకు తీవ్రగాయాలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో లెక్చర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రచయిత సల్మాన్ రష్దీపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మెడపై కత్తితో పొడవడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. అయితే 75 ఏళ్ల సల్మాన్ రష్దీ రచనలు వివాదాస్పదం అయ్యాయి. ఈ రచనలు బెదిరింపులకు దారితీశాయి. రష్దీ రాసిన సాతాన్ వర్సెస్ పుస్తకం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 


స్టేజి పైనే కుప్పకూలిన రష్దీ


భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ నవలా రచయిత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. న్యూయార్క్ లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చర్ ఇచ్చేందుకు  సిద్ధమవుతుండగా ఆయన వైపు దూసుకొచ్చిన ఓ వ్యక్తి సల్మాన్ రష్దీపై కత్తితో  దాడి చేశాడు. అమెరికా న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చర్ ఇచ్చేందుకు రష్దీ హాజరయ్యారు. కత్తి పోట్లకు గురైన రష్దీ స్టేజిపైనే కుప్పకూలిపోయారు. గాయాలపాలైన ఆయన్ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశం ఇంకా తెలియాల్సి ఉందని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. దాడికి పాల్పడ్డ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 


వివాదాస్పద నవల 


1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్‌ రష్దీ బ్రిటన్‌లో సెటిల్ అయ్యారు. రష్దీ రచించిన మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ నవలకు 1981లో బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. దీంతో ఆయన ఫేమస్‌ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ది సాతానిక్‌ వెర్సెస్‌‌ నవల వివాదాలకు మూలమైంది. అప్పటి నుంచి ఆయనకు  బెదిరింపులు మొదలయ్యాయి. మతాన్ని కించపరిచేలా ఈ నవల ఉందని 1988లో ఇరాన్‌ ఈ నవలను నిషేధించింది.  






పోలీసుల అదుపులో నిందితుడు 


న్యూయార్క్ స్టేట్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... రచయిత సల్మాన్ రష్దీపై కత్తితో దాడి చేసినట్లు ధృవీకరించారు.  హెలికాప్టర్‌లో అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దాడి చేసిన వ్యక్తి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్ నగరానికి 100 కి.మీ దూరంలో ఉన్న చౌతాక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ దాడి జరిగింది. దుండగుడు ఒక్కసారిగా వెనుక నుంచి దాడి చేయడంతో రష్దీ మెడ భాగంలో గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సల్మాన్ రష్దీతో పాటు పక్కనున్న వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే రష్దీ నేలపై కుప్పకూలిపోయారు. స్టేజ్ కిందనున్న వారు రచయితకు సాయం చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, దాడి చేసిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.