Nepal Ban Entry of India: కోరనా మహమ్మారి సమస్య ఇంకా తొలగిపోలేదు. కొత్తగా సబ్ వేరియంట్లు, మంకీ పాక్స్ లాంటి వాటితో ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే హెచ్చిరించింది. దేశంలో కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై నేపాల్ నిషేధం విధించింది. ఇండియా నుంచి నేపాల్ వెళ్లిన నలుగురు పర్యాటకులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో.. వారిని వెనక్కి పంపించింది. ఈ నలుగురూ ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం గుండా నేపాల్ లోని బైతాడి జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారికి కొవిడ్ పాజిటివ్ తేలినట్లు వివరించారు.
భారతీయులకు నో ఎంట్రీ..
భారతీయ పర్యాటకుల కోసం కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా పెంచినట్లు వివరించారు. భారత్ నుంచి తిరిగి వచ్చిన నేపాలీల్లో కూడా కొందరు కరోనా బారిన పడినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భారత పర్యాటకులు నేపాల్ లోకి ప్రవేశించకుండా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. నేపాల్ లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి. భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న బైతాడి జిల్లాలో ప్రస్తుతం 31 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో మూడు వారాల క్రితం వరకు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే వెయ్యి 90 కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. గత ఆరు నెలల్లో నిన్న ఒక్కరోజే ఎక్కువ కేసులు నమోదుయ్యాయని తెలిపారు.
దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు
దేశంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు 16,047 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అంతకు ముందు రోజు ఈ సంఖ్య 12, 751 గా ఉంది. నిన్న మొత్తం 54 మంది కరోనా కారణంగా చనిపోయారు. 24 గంటల వ్యవధిలో 19,539 మంది కరోనా నుంచి కోలుకోగా... ఈ రేటు 98.52 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.29 శాతానికి పడిపోయాయి. ఈ క్రమంలోనే భారత్ లో మంగళ వారం 15 లక్షల 21 వేల 429 మందికి టీకాలు అందించినట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 207.03 కోట్లు దాటిందని.. మరో 3 లక్షల 28 వేల 81 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా
ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. చాలా దేశాల్లో కొవిడ్ కేసులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 7,69,711 మంది వైరస్ బారిన పడగా 2,060 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59,09,91,820 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు వైరస్ తో 64,41,530 మంది మరణించారు. ఒక్కరోజే 10,41,580 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 56,27,68,702కు చేరింది.