Drugs Seized At Chennai Airport: చెన్నై విమానాశ్రయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువ చేసే 9.590 కిలోల డ్రగ్స్‌ను ఓ ప్రయాణికుడి వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుడ్ని అనుమానించి తనికీ చేయగా డ్రగ్స్ దందా వెలుగుచూసింది. లో దుస్తుల్లో దాచి తీసుకొచ్చినా, అధికారులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి వద్ద నుంచి కొకైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
9.590 కిలోల కొకైన్, హెరాయిన్ స్వాధీనం
ఇథియోపియా నుంచి విమానంలో చెన్నైకి డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అనుమానించి, అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేసిన అధికారులు అతడి వద్ద ఉన్న డ్రగ్స్ చూసి షాకయ్యారు. ఇక్బాల్ పాషా(38) అనే నిందితుడు లోదుస్తులు, కోటులో దాచిపెట్టి తరలిస్తున్న మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లో దుస్తులు, షూలో కలిపి మొత్తం 9 కిలోల 590 గ్రాముల కొకైన్ మరియు హెరాయిన్ ను అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేశారు.
రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్..
ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి ఇథియోపియా ఎయిర్ లైన్స్‌లో ఇక్బాల్ చెన్నై వచ్చాడు. డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘా పెంచిన కస్టమ్స్ అధికారులకు ప్రయాణికుడి తీరుతో అనుమానం వచ్చింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక్బాల్ పాషాను ప్రశ్నించగా అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇథియోపియాకు ఎందుకు వెళ్లాడు, అక్కడ ఏం చేశాడని అధికారులు ప్రశ్నిస్తే సరైన జవాబు ఇవ్వకపోవడంతో తనిఖీలు చేసిన అధికారులు తొమ్మిదిన్నర కేజీల కొకైన్, హెరాయిన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.100 కోట్లు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. షూస్, లో దుస్తుల్లో అతడు డ్రగ్స్ దాచి అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఇక్బాల్ పై కేసు నమోదు చేశారు.
చెన్నై ఎయిర్ పోర్ట్ చరిత్రలోనే తొలిసారి..
చెన్నై ఎయిర్ పోర్టులో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను ఎప్పుడు సీజ్ చేయకపోవడంతో కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. 1932లో చెన్నై ఎయిర్ పోర్ట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు తాజాగా తొలిసారి రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇక్బాల్ ఒక్కడే ఈ పని చేశాడా, అతడి వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా అనే కోణంలోనూ పోలీసులు, కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి వంద కోట్ల విలువైన డ్రగ్స్ విదేశాల నుంచి తీసుకొచ్చాడంటే దీని వెనుక ఏదైనా పెద్ద గ్యాంగ్ ఉండొచ్చునని, ఈ డ్రగ్స్ ను ఎక్కడ విక్రయిస్తున్నారనే దానిపై ఫోకస్ చేశారు. ఈ కేసును అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
ఇటీవల 1.2 కేజీల డ్రగ్స్ స్వాధీనం
రెండు రోజుల కిందట ఇథియోపియా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ.11.75 కోట్ల విలువైన 1.218 కిలోల కొకైన్ ను చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్‌బ్యాగ్, లోదుస్తులలో దాచిపెట్టిన మహిళా ప్రయాణికురాలిని కస్టమ్స్ విభాగం అదుపులోకి తీసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టిన సమయంలో భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.