Vadapalli Venkateswara Swamy Temple:
సొంత విమానంలో వాడపల్లి వెంకన్న సన్నిధికి..!
ఆరువారాలుగా వస్తున్న బెంగుళూరుకు చెందిన వ్యాపారి..


అంబేడ్కర్‌ కోనసీమలో మరో చిన్న తిరుపతిగా పేరు పొందిన వాడపల్లి వెంకన్న సన్నిధికి బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారి మొక్కుబడి తీర్చుకునేందుకు సొంత విమానంలో ఆరు వారాలుగా వస్తున్న వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది. బెంగుళూరు నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి సొంత విమానంలో చేరుకుంటున్న భక్తుడు అక్కడి నుంచి కారులో వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చేరుకుంటున్నారు. ఏడు వారాలు విధిగా వాడపల్లి వెంకన్న సన్నిధికి రావడం వల్ల కోరిన కోర్కెలు తీరే ఆలయంగా ప్రతీతి ఉంది. ఈ క్రమంలో గత అయిదు వారాలుగా మొక్కు తీర్చుకుంటుండగా ఈ శనివారంతో ఆరో వారం పూర్తయ్యింది. మరో వారం అంటే ఈనెల 28న మళ్లీ సదరు భక్తుడు వాడపల్లి వెంకటేశ్వరస్వామి సన్నిధికి వస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు. 


ఏడు వారాలు వస్తే మంచి జరుగుతుందని నమ్మకం..
కోనసీమలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధానంగా ఏడు వారాలు వెంకన్నను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం..ఈ నేపథ్యంలోనే కోనసీమ పరిసర ప్రాంతాలనుంచే కాక ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి వందలాది మంది భక్తులు వాడపల్లి వెంకన్న సన్నిధికి వరుస కడుతుంటారు.. వారంలో ప్రతీ శనివారం తెల్లవారు జామునుంచే ఈ ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు.  ఇదే విషయం తెలుసుకున్న బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారి ఆరువారాలుగా బెంగుళూరు నుంచి రాజమండ్రి ఎయిర్‌ పోర్ట్‌కు తన సొంత విమానంలో వచ్చి అక్కిడి నుంచి కారులో వాడపల్లి వచ్చి వెంకన్నను దర్శించుకుంటున్నారని తెలియడంతో భక్తులే కాదు.. కోనసీమ ప్రజలు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. 


ప్రతి శనివారం భక్తులతో కిటకిట..
ఆత్రేయపురం మండలం పరిధిలోకి వచ్చే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఖ్యాతి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు తెలుస్తోందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయానికి రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు వరుస కడుతుండగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ, ప్రముఖ సినీనటుడు సుమన్‌ విచ్చేశారు. తాజాగా బెంగుళూరుకు చెందిన వ్యాపారి తన సొంత విమానంలో వెంకన్నను దర్శించుకునేందుకు ప్రతీ వారం రావడంపై వాడపల్లి వెంకన్న విశిష్టత గురించి సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు..


ఆలయానికి రూ.కోటి విరాళం..
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి అయిదు వారాలుగా వస్తున్న భక్తుడు రూ.కోటి విరాళాన్ని అందించారని ఆలయ అధికారులు తెలిపారు.