రామచంద్రపురంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైసీపీలో కీలక నేతల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు అవసరమైతే తన ఎంపీ పదవికి, పార్టీకు రాజీనామా చేస్తానని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి జగన్ వెంటే నడిచానని, పార్టీ ఆదేశాల మేరకే నడచుకున్నానని అన్నారు. కానీ అవకాశవాద రాజకీయాలు చేసే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలవబోనంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు రామచంద్రపురం వైసీపీ టిక్కెట్టు ఇస్తే స్వయంగా తాను లేదా కుమారుడు సూర్యప్రకాష్ ఇండిపెండెంట్‌గానైనా రంగంలోకి దిగుతామని తేల్చిచెప్పారు.
మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం
రామచంద్రపురంలో బోస్‌కు వ్యతిరేకంగా మంత్రి చెల్లుబోయిన వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న వైరాన్ని ఇది మరింతగా పెంచి పోషిస్తోంది. ఆదివారం కూడా ఓ సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రితోపాటు ఆయన కుమారుడు, మంత్రి ముఖ్య అనుచరులు అంతా హాజరయ్యారు. ఈసమావేశం పూర్తిగా తన బలప్రదర్శన చేసుకునే విధంగానే ఉంది. దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై తన అనుచరుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది.
ఇప్పటికే వారం రోజుల క్రితం రామచంద్రపురంలో బోస్ అనుకూల వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రామచంద్రపురం వైసీపీ టిక్కెట్ బోస్ తనయుడు సూర్యప్రకాష్‌కు ఇవ్వాలని, మంత్రి వేణు తమను అన్నివిధాలుగా రాజకీయంగా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని బోస్ అనుచరులు ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి వద్దకు చేరిన పంచాయతీ..
రామచంద్రపురం నియోజకవర్గం కేంద్రంగా రచ్చకెక్కిన వైసీపీలో అంతర్యుద్ధం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వద్దకు చేరింది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రిని కలిశారు. రచ్చకెక్కిన విభేదాలు వల్ల పార్టీకు నష్టం వాటిల్లుతోందని, ఏమైనా ఉంటే ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడతానని జగన్ చేప్పారు. రామచంద్రపురంలో వేణు పోటీచేయడం తనకు ఇష్టం లేదని తాను చెప్పేశానని బోస్ అంటున్నారు. ఈవిషయంలో ముఖ్యమంత్రి జగన్ బోస్‌పై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఎంపీ బోస్ మరోసారి రామచంద్రపురంలో మంత్రి వేణుకు టిక్కెట్టు ఇస్తే తాను కానీ, తన కుమారుడు కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని, పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బోస్ వెల్లడించారు.
తెలుగుదేశం వైపు చూపులు...?
రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు బలమైన వర్గం ఉంది. వేణుకు ఆ స్థాయిలోనే వర్గం ఉన్నప్పటకీ స్థానికుడు కాదన్న విమర్శ ఉంది. ముఖ్యమంత్రి జగన్ తనకు సంతృప్తికరమైన స్థానాన్ని ఇచ్చారని చెబుతూనే తనకు మంత్రి వేణు రామచంద్రపురంలో పోటీ చేయడం ఇష్టం లేదని తేల్చిచెబుతున్నారు బోస్. అయితే అధిష్టానం ఇప్పటికే రామచంద్రపురం నుంచి వేణు పోటీ చేస్తారని ఓ క్లారిటీ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రీమూర్తులు టీడీపీని వీడి వైసీపీలో చేరాక ఆయనకు మండపేట వైసీపీ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో కొత్తపేటకు చెందిన మాజీ శాసన మండలి వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా టీడీపీ నియమించింది. అయితే బోస్ వంటి బలమైన నాయకుడు టీడీపీలోకి వస్తే వెంటనే ఆహ్వానించడమే కాకుండా పార్టీ టిక్కెట్టు కూడా ఇస్తామని హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి ఈనెల 26న రానున్నారు. ఈ సందర్భంగా బోస్‌ను పిలిపించి మాట్లాడి రచ్చకెక్కిన రగడను సర్దుబాటు చేస్తారా.. ఈలోనే నిర్ణయం తీసుకుని బోస్ పార్టీకి రాజీనామా చేస్తారా అన్నది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.