Bengal Tiger In Kakinada: కాకినాడ జిల్లాతో నెల్లిపూడిలో ప్రజలకు పెద్దపులి కనిపించినట్లు తెలుస్తోంది. పులి మంగళవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో స్థానికుల కంటపడిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమై అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గత 23 రోజులుగా కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు, శంఖవరం మండల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బెంగాల్ టైగర్ కొంతంగి కొత్తూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో మకాం వేసినట్లు పెద్దపులి అడుగు జాడలను బట్టి అధికారులు అంచనాకొచ్చారు. అయితే తాజాగా నెల్లిపూడి గ్రామంలోనే పెద్దపులి ప్రజల కంటబడడంతో ఈపరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందని నిర్ధారించి ప్రజ లను అప్రమత్తం చేశారు. 


నిన్న మొన్నటి వరకు శంఖవరం మండలం వజ్రకూటం పరిసర ప్రాంతాల్లో పులి సంచరించినట్లు గుర్తించిన అధికారులు నెల్లిపూడి మీదుగా కొంతంగి గ్రామం వైపుగా వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నెల్లిపూడి, కొంతంగి గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో మైక్‌లో అనౌన్స్ కూడా చేయించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నెల్లిపూడి గ్రామంలో పలు ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేశారు. అయినా పులిజాడ కనిపించలేదు. అయితే పొలాల్లోకి, తొటల్లోకి రైతులు చీకటిపడేవరకు ఉండవద్దని, ఒంటరిగా కూడా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. దీంతో పొలం పనులు చేసుకునేందుకు రైతులు హడలెత్తిపోతున్నారు. మరో వైపు కూలీలు పనులుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు తీరుపై మాత్రం ఈ గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. రోజులుపాటు కాలక్షేపం చేస్తున్నారు కానీ పులిని పట్టుకునేందుకు సరైన ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యపు పనితీరుతో ఎన్నిరోజులు భయం భయంగా బ్రతకాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ప్రజలు చెబితే అధికారుల నిర్ధారణ 
పులి అడుగుజాడలను బట్టి తామే గుర్తించి చెబుతుంటే తీరిగ్గా వచ్చి అవి పులి అడుగులేనని అధికారులు నిర్ధారిస్తున్నారని, పగలంతా మొక్కుబడిగా తిరిగి ఈ ప్రాంతాల్లో పులి వచ్చి ఉండదని చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. తమకు తాముగా పరిశీలన చేసి పులి తిరుగుతున్న ప్రాంతాన్ని, కదలికలను గుర్తించిన దాఖలాలు లేవని, ఇది అధికారులు, సిబ్బంది పనితీరుకు అద్దంపడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఈపరిస్థితిని గమనించి ఉత్తమ మార్గంలో పులిని పట్టుకునే చర్యలు చేపట్టాలని, పులి భయంతో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Kakinada Tiger: ముప్పు తిప్పలు పెడుతున్న బెంగాల్ టైగర్, 20 రోజులుగా జనాలకి గుండెల్లో దడ