కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో చెలరేగిన అల్లర్ల వ్యవహారంలో పోలీసులు నిందితులను గుర్తించారు. అందులో మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులే ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు నలుగురు వైఎస్ఆర్ సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులుగా ఉన్న సత్యరుషి, మట్టపర్తి మురళీ, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి రఘులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయి ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వీరిపై కేసులు పెట్టారు. అయితే, ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని, వీరిని వెతికి పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ జీవో విడుదల చేసిన వెంటనే అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 2 258 మంది నిందితులను పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో 142 మందిని ఇప్పటిదాకా అరెస్టు చేశారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
మే 24వ తేదీన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనల్లో అల్లరి మూకలు మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లని తగలబెట్టారు. దీంతో ఆ అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. దొరికిన వారిని అరెస్టు చేశారు.