కుటుంబానికి రూ.46 వేలు చొప్పున 107.90 కోట్లు ఇస్తున్నాం: జోగి రమేష్


డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా... ముమ్మిడివరం..
మత్స్యకారుల సంక్షేమానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని కోనసీమ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో వీడిఆర్ నగర లేఔట్ నందు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అధ్యక్షతన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఓఎన్‌జీసి సంస్థ చమురు అన్వేషణలో భాగంగా డ్రెడ్జింగ్, పైప్ లైన్ వేయడం వల్ల వేట నష్టపోయిన మత్స్యకారులకు 69 గ్రామాలకు చెందిన మత్స్యకారులకు రెండవ విడతగా జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి మొత్తం 23,458 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క కుటుంబానికి రూ 46 వేలు చొప్పున మొత్తం రూ. 107.90 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆ మొత్తాన్ని సీఎం జగన్ వర్చువల్ విధానంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి డిబిటి ద్వారా లబ్ధిదారుల ఖాతాకు నేరుగా జమ చేశారని చెప్పారు.


దేశ చరిత్రలో ఇలాంటి నష్టపరిహారాలు చెల్లించిన సంఘటనలు లేవు 
వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రాధాన్యత మత్స్యకార రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. నష్ట పరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులను కోరారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో ఓఎన్జిసి ద్వారా నష్టపరిహారాలు చెల్లించిన సంఘటనలు లేవని కానీ ప్రభుత్వ చొరవతో గతంలో ఓఎన్‌జీసీ బకాయి పడ్డ నష్టపరిహారాన్ని రూ.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం జరిగిందన్నారు. వేట లేక మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస దుస్థితి నెలకొంటున్న పరిస్థితుల్లో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కొంతవరకు వారి జీవనోపాధి పెంపునకు దోహద పడతాయన్నారు. ఐ.పోలవరం మండలం బైరవపాలెం చెందిన రేవు దుర్గాభవాని, కొల్లేటి నారాయణమ్మలు ప్రభుత్వ పథకాల అందుతున్న తీరుపట్ల తమ స్పందనను సభలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వి. వేణుగోపాలరావు, పిగన్నవరం ఎమ్మెల్యే కే.చిట్టిబాబు, జాయింట్ కలెక్టర్లు ధ్యానచంద్ర, ఎస్ ఇలాకియా, ఓఎన్‌జీసీ జిజిఎం రవిచంద్రన్, హెచ్ ఆర్ డి.మల్లిక్ సిహెచ్ శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడి షేక్ లాల్ మహమ్మద్, అసిస్టెంట్ కలెక్టర్ సుభాష్ జైన్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


తూర్పు గోదావరి..   యానాం..
అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం, మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ బీచ్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం, కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా యానం ప్రజలందరూ ఒక్కచోట చేరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలనే ఆలోచన ఈరోజు నెరవేరిందింన్నారు. ముందుగా ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిలో బోటులు, పడవలతో విన్యాసాలు నిర్వహించారు. అనంతరం జట్టి వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. యానం నియోజకవర్గం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.