CM Jagan Narasapuram Tour: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగించారు. నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎప్పుడూ జరగలేదని జగన్ అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం ఇదే తొలిసారని అన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసు. ఫిషరీస్ యూనివర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయి. దేశంలో మూడో ఫిషరీస్ యూనివర్శిటీ ఏపీలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీస్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నాం’’
‘‘ముమ్మిడివరంలో వేట కోల్పోయినవారికి అండగా నిలుస్తున్నాం. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాం. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి హామీని నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం’’ అని సీఎం అన్నారు.
ప్రారంభోత్సవాలు ఇవీ
Narasapuram News: నరసాపురంలో ఉన్న 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రిలో కొత్తగా రూ.13 కోట్లతో మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. నరసాపురం పట్టణంలో మంచి నీటి సమస్య నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు.
ఇవీ శంకుస్థాపనలు..
CM Jagan in Narasapuram: రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం చేపడతారు. రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం చేయనున్నారు. రూ.1.08 కోట్లతో నరసాపురం డివిజినల్ సబ్ ట్రెజరీ ఆఫీసు కొత్త భవన నిర్మాణం చేశారు. రూ.87 కోట్లతో ఫస్ట్ ఫేజ్ పనులు, రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్ట పనులు చేపట్టనున్నారు. రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు, మున్సిపాలిటీ పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయనున్నారు.
రూ.7.83 కోట్ల అంచనా ఖర్చుతో చివరి గ్రామాలకు సాగు, తాగు నీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు చేపట్టడానికి శంకుస్థాపన చేశారు. రూ.4 కోట్ల ఖర్చుతో నరసాపురం బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.