AP Deputy CM Pawan Kalyan in flood affected areas in pithapuram | గొల్లప్రోలు: కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు చెప్పారు. సుద్ధగడ్డ వాగు సమస్యకు పిఠాపురం ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో గొల్లప్రోలులో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుంది. జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొన్నారు. ఎకరా భూమి మార్కెట్ ధర రూ. 30 లక్షలు కాగా, రూ. 60 లక్షలు చెల్లించి కొన్నారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై కలెక్టర్ తో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రజల బాధలు చూసి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాను. వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చింది. పంచాయతీలను ఆదుకునే బాధ్యతను మేం తీసుకున్నాం.
బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ సంచలన వ్యాఖ్యలు
విజయవాడలో బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రా వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుడమేరు సంబంధించిన భూమిలో తెలిసో తెలియకో కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. ఆక్రమిత స్థలం అని తెలియక కొనుగోలు చేసిన వారు సైతం ఉన్నారని జనసేనాని తెలిపారు. అయితే అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా లాంటి వ్యవస్థతో కూల్చివేతల కంటే, ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.
Also Read: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
నదీ పరివాహక ప్రాంతాలు, కాలువలు, వాగుల పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై అవగాహన పెరగాలి. తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షాలతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడింది. వరదల నుంచి కోలుకోవడానికి విజయవాడ ప్రజలకు కాస్త సమయం పట్టొచ్చు. అమెరికా లాంటి దేశాలలో కూడా వరద లాంటి విపత్తుల తరువాత కోలుకోవడానికి టైమ్ పడుతుంది. వరదలపై సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని, అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సైతం విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను అడిగి వారి కష్టాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై సైతం బాధితులను ఆరా తీశారు. బుడమేరు గండ్లను సాధ్యమైనంత త్వరగా పూడ్చామని, మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న గేట్ల స్థానంలో స్టీల్ తో తయారుచేసిన భారీ కౌంటర్ వెయిట్స్ ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, జలవనరుల నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్లు, అధికారులు ఎంతగానో శ్రమించి ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు కౌంటర్ వెయిట్స్ అమర్చారు.