అమరావతి: ఏపీలో గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే 48 గంటల్లో వరదబాధిత కుటుంబాలకు రూ.2వేలు, రేషన్ అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా వరద తగ్గిన తర్వాత 10 రోజుల్లో ఆస్తి, పంట నష్టాలపై అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
గోదావరి వరద పరిస్థితులు, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులు, సహాయక కార్యక్రమాల తీరు తెన్నులను సీఎం జగన్ సమీక్షించారు. మంచి పనులు చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, అవిశ్రాంతంగా పనిచేస్తున్నప్పటికీ కొందరు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కొన్ని మీడియాలతో కలిసి తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు.
రివ్యూలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..
గోదావరికి ప్రస్తుతం వరద క్రమంగా తగ్గుతోంది. వరద సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వరదలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్లు, సీనియర్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 48 గంటల్లో గోదావరి వరద బాధితులు ప్రతి కుటుంబానికి రూ.2వేలు సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్ అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు మంచి చేస్తున్నా విపక్షాలు తమపై చేసే విమర్శలు, ఆరోపణలు పట్టించుకోకుండా ముందడగులు వేయాలని అధికారులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు ప్రజల ప్రయోజనాలకు అడ్డు పడుతున్నారని, వారిని పట్టించుకోవద్దన్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసి, బాధితులకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తూనే ఉండాలని సీనియర్ అధికారులపై బారం ఉందన్నారు. తనకు పది రోజులల్లో ఆస్తి, పంట నష్టం వివరాలపై అంచనాల నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.