Godavari Floods: గతం పది రోజులుగా కురిసిన వర్షానికి గోదావరి నది ఉగ్రరూపం దాల్చంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరిగకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు తీస్కున్నారు. అయితే ఇప్పుడిప్పుడే గోదావరి నదికి వరద ఉద్ధృతి కాస్త తగ్గుతోంది. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికీ సాగుతున్న సహాయక చర్యలు..
వరదలు నేపథ్యంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయా సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇస్తూ... అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశ్యంతో రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే ఇప్పటికీ 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేస్తూనే ఉన్నాయి. వరదల కారణంగా ఇప్పటికీ చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మొత్తం ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితం అయ్యాయి. మరో 241 గ్రామాల్లోకి వరద నీరు చేరిపోయింది.
పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అండగా ప్రభుత్వం..
అయితే ఇప్పటి వరకు 97, 205 మందిని వరద ముంపు ప్రాంతాల నుంచి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికి వసతితో పాటు బోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మొత్తం 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ.. వరద బాధితులకు సాయం చేస్తున్నారు. అలాగే ఆకలితో అలమటిస్తున్న వరద బాధితుల కోసం 1,25,015 ఆహార ప్యాకేట్లు పంపిణీ చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు. అలాగే ప్రజలు పూర్తిగా వరద ప్రభావం తగ్గేవరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి సమస్యలు వచ్చిన స్థానిక అధికారులకు చెప్పాలని చెబుతున్నారు.
సరిపడా ఆహారం లేక అల్లాడిపోతున్నామయ్యా..
అయితే కొన్ని చోట్ల మాత్రం తమకు కనీసం తినేందుకు తిండి కూడా పెట్టట్లేదని వరద బాధితులు ఆవేదన వ్యకతం చేస్తున్నారు. సరిపడా అన్నం లేక, పిల్లలకు కనీసం పాలు కూడా దొరకడం లేదని వాపోతున్నారు. కోనసీమనలోని వరద బాధితుల ఆవేదన అంతా ఇంతా కాదు. కొంతమంది ఏటి గట్లపైనే గుడారాలు వేస్కొని ఉంటున్నారు. వరదలు వచ్చి అయిదు రోజులు గడుస్తున్నా.. శనివారం నుంచే భోజనాల సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు పాత బకాయిలు చెల్లించకపోవడంతో పడవలు నడవడం లేదని... పలు చోట్ల భోజనం కూడా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్షేత్ర స్థాయిలో తిరుగుతూ.. వరద బాధితులకు సాయం చేయాలని కోరుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, పండు ముసలి వాళ్లు చలికి వణికిపోతున్నారని.. ఆకలికి అలమటిస్తూ ఆగమైపోతున్నారని చెబుతున్నారు.