Bizarre statements by  politicians : రాజకీయ నేతల ప్రతి మాట వెనుక అర్థం వేరే ఉంటుంది. అదే పండిపోయిన రాజకీయ నేతల మాటలకు " వ్యూహం " అని పేరు పెట్టేసుకుని అనేక విశ్లేషణలు చేయడానికి విశ్లేషకులకు చాలా పని పడుతుంది. ఒక్కో సారి ఆ మాటలు సీరియస్‌గా కాదు కామెడీగా ఉంటాయి. అలాంటి మాటలనే తాజాగా సీఎం కేసీఆర్ "క్లౌడ్ బరస్ట్ కుట్ర" పేరుతో చేశారు. వర్షాల కోసం కప్పల పెళ్లిళ్లు లాంటివి చేసుకోవడమే మనకు తెలుసు.. ఇలా బీభత్సంగా వర్షాలు కురిపించవచ్చని ఎవరూ ఊహించని విషయం. చైనా ఇలా అలా చేస్తుందని చెప్పుకోవడమే కానీ స్పష్టమైన ఆధారాలు లేవు. సామాన్యులకైతే అసలు ఈ విషయంపై అవగాహన ఉండదు. అందుకే కేసీఆర్ ప్రకటన చర్చనీయాంశమయింది. చాలా మంది కేసీఆర్‌ మరీ అంత వాస్తవ విరుద్ధంగా ఆలోచిస్తారా అని అంటూంటే.. మరికొంత మంది మాత్రం అందులో నిజం ఉండవచ్చని కౌంటర్ ఇస్తున్నారు. ఏదైతేనేం చర్చ ప్రారంభమయింది. కానీ అసలు కేసీఆర్ అలా వ్యాఖ్యానించడానికి కారణాలేమిటన్నదానిపై మాత్రం నిజం ఎవరికీ తెలియదు. 


మేఘాల చాటున దాక్కుని సర్జికల్ స్ట్రైక్స్ చేశామన్న మోదీ ! 


ఒక్క కేసీఆర్ మాత్రమేనా...స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇలాంటి బిజారే ప్రకటనలు ఎన్నో చేశారు. అవి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. మన యుద్ధ విమానాలు.. మేఘాల చాటున దాక్కుని పాకిస్థాన్ రాడార్లకు చిక్కకుండా.. వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేశాయని స్వయంగా ప్రధాని మోదీ గత ఎన్నికలకు ముందు ఓ ఇంటర్యూలో చెప్పారు. ప్రధాని మోదీ అవగాహనా స్థాయి అదేనా అని చాలా మంది సోషల్ మీడియాలో దెప్పిపొడిచారు. ఆ తర్వతా  ఓ సమావేశంలో విండ్ టర్బైన్ కంపెనీ సీఈవోతో మాటామంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా  గాలి మరల నుంచి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆక్సీజన్, శక్తిని పొందవచ్చని మోడీ ఆ కంపెనీ సీఈఓకి సూచించారు. ఈ వీడియో క్లిప్ కూడా వైరల్ అయింది. ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. 


అవాక్కయ్యే ప్రకటనలు చేయడంలో రాటుదేలిపోయిన నేతలు !


ప్రధాని, కేసీఆర్ మాత్రమే కాదు అనేక మంది సీఎం స్థాయి నేతలు ఇలాంటి ఆశ్చర్యకరమైన ..  వాస్తవంగా జరగదు అనుకునే ప్రకటనలు చేస్తూ ఉంటారు. వారు చాలాసీరియస్‌గా చెబుతూంటారు. వైఫై మహాభారత కాలంలోనే ఉందని ఓ ముఖ్యమంత్రి చెబుతారు. విమానాలు కూడా అప్పట్లోనే ఉన్నాయంటారు. ఇలాంటి ప్రకటనలకు కొదవ ఉండదు. కానీ వీరంతా ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తారనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. వాటిని వింటే ఏమీ చదువుకోని వారికి కూడా వింతగా ఉంటుంది. మరీ అన్నీ తెలిసి.. ఎంతో ఎత్తుకు ఎదిగిన నేతలు ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తారనేది మాత్రం సస్పెన్స్‌గానేఉంది. ముందుగా  చెప్పుకున్నట్లుగా రాజకీయ నేతలు ఎలాంటి ప్రకటనా ఊరకనే చేయరు. దాని వెనుక రాజకీయ లెక్కలు ఉంటాయి. 


ఆ విషయాలు వారికి తెలియక కాదు - రాజకీయం కోసమే చేస్తున్నారు. 


సాధారణంగా ఏదైనా సమస్యలపై చర్చ జరుగుతున్నప్పుడు  పాలకులు దాన్నుంచి దృష్టి మళ్లించడానికి వేరే ఇతర చర్చను లేవనెత్తడానికి ఇలాంటి అవాక్కయ్యే ప్రకటనలు చేస్తున్నారని చెబుతూంటారు. ప్రస్తుతం వరదల నష్టం.. కాళేశ్వరం మునకపై చర్చ జరుగుతున్నందున క్లౌడ్ బరస్ట్ కుట్ర గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఈ ఒక్క మాటతో రెండు రోజుల నుంచి దీనిపైనే చర్చ జరుగుతోంది. ప్రదాని మోదీ కూడా ఇలాంటి ప్రకటనలు.. ఇంటలెక్చువల్స్ గురించికాదని.. అత్యంత సామాన్యుల గురించి కోసమే మాట్లాడుతూంటారని చెబుతూంటారు. అందుకే.. రాజకీయ నేతలు చేసే విచిత్ర ప్రకటన వెనుక అసలు కారణం .. వారికి తెలియకపోవడం కాదు. అంతకు మించిన రాజకీయం  ఉందని అర్థం చేసుకోవాలి.