Andhra Pradesh News | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామ సభలో పాల్గనేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి వచ్చారు. సభలో పాల్గోన్న ముఖ్యమంత్రి అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు.. ఈ క్రమంలోనే అదే గ్రామం సంఘంపాలెంకు చెందిన రెండు కాళ్లు కోల్పోయిన దివ్యాంగుడు ఇళ్ల భగవాన్‌, కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన మరో దివ్యాంగ యువకుడు చింతపల్లి నాగమల్లేశ్వరరావులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిపి తమ దీన స్థితిని వివరించారు. దానికి చలించిన ముఖ్యమంత్రి తన పెద్దమనసును చాటుకున్నారు. వారి దైనందిన అవసరాల నిమిత్తం వెంటనే వారికి ఎలక్ట్రికల్‌ స్కూటర్లును అందజేయాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీతో వెంటనే జిల్లా కలెక్టర్‌ స్కూటర్లును కొనుగోలుచేయాలని రవాణాశాఖ అధికారులకు ఆదేశించడంతో హుటాహుటీన వాటిని ఏర్పాట్లు చేయించారు. 


24 గంటల్లోనే ఎలక్ట్రికల్‌ స్కూటర్లు.. 
చంద్రబాబు ఆదేశాల మేరకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ రవాణాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఇరువరికి డ్రైవింగ్‌ సామర్ధ్య పరీక్ష నిర్వహించిన తరువాత సక్రమంగానే వారు డ్రైవింగ్‌ చేస్తున్నారని నిర్ధారించుకున్న నేపథ్యంలో వారి అభిష్టం మేరకు వారు కోరిన రంగు గల ఈవీ స్కూటర్లును కొనుగోలు చేసి వాటిని శనివారం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి చేతులమీదుగా అందజేశారు. వీటి ధర ఒక్కొక్కటి రూ.1.5 లక్షలు కాగా డ్రైవింగ్‌ చేసే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని లబ్ధిదారులకు అధికారులు సూచించారు. 


ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎంకు కృతజ్ఞతలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 24 గంటలు తిరగకుండానే తాము కోరిన స్కూటర్లును అందజేయడం పట్లా లబ్ధిదారులు ఇళ్ల భగవాన్‌, చింతపల్లి నాగమల్లేశ్వరరావులు సంతోషం వ్యక్తం చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 


వానపల్లి గ్రామ సభలో పాల్గన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ యువకుడు  భారత జాతీయ చిహ్నం అయిన మూడు సింహాల చిత్రంను అనుకరిస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రాలను గీసి ఇచ్చాడు. దానిపై ఓం నమో నారా వారాహి నమ: అనే కొటేషన్‌ను కూడా రాశాడు.. దీనిని అందుకున్న ముఖ్యమంత్రి చందబ్రాబు ఆ యువకుడిని దగ్గరకు తీసుకుని ఫొటో కూడా తీయించుకున్నారు. అయితే భారత చిహ్నమైన మూడు సింహాల స్థానంలో మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫోటోలు గీయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. న్యాయవ్యవస్థకు చిహ్నంగా ఉన్న మూడు సింహాల చిత్రాన్ని ఇలా నాయకులు ఫొటోలు గీయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు..