వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ . జగన్ ప్రభుత్వంపై రాష్ట్రంలో ఎక్కడ చూసినా విమర్శలు వ్యక్తమవుతున్నాయని..రోజురోజుకీ ప్రజల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని… యువత ఉపాధి కోల్పోయి వలసలు వెళ్తున్నారని.. భవిష్యత్‌పై వారికి భయం పట్టుకుందన్నారు. యువతకు అండగా జాబ్ క్యాలెండర్ పై శాంతియుతంగా నిరసన తెలుపుదామన్నా పోలీసుల అండతో ఇబ్బంది పెట్టాలని చూసిన విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆర్ధికలోటు వేధిస్తోందని, వేలకోట్లు ఎటు వెళ్లిపోతున్నాయో ఎవరికీ తెలియదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి గాడి తప్పి ఉందనే విషయం దేశమంతటా తెలిసిందన్నారు.


 “జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టమైన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లిన కార్యకర్తలను అభినందించడం అందరి ప్రథమ కర్తవ్యం అన్నారు నాదెండ్ల మనోహర్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరణ కార్యకర్తలకు బీమా పత్రాలు, ఐడీ కార్డులతో కూడిన కిట్లను అందించారు. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జనసైనికులను అభినందించారు. పార్టీ కోసం గ్రామ, మండల స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రమాదం జరిగినప్పుడు దేశ, విదేశాల్లో ఉన్న పార్టీ సానుభూతి పరులు స్పందించి బాధిత కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకుంటున్నారని…అలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు పార్టీలో చాలా మంది ఉన్నారని తెలిపారు మనోహర్. వారందరి స్ఫూర్తితోనే కియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.


ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ జనసేన


ఇప్పటి వరకూ దేశంలో ఏ పార్టీలోనూ లేని విధంగా కార్యకర్తలకు ప్రమాద బీమా  5 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక పార్టీ జనసేన అన్నారు మనోహర్. అలాంటి పార్టీ కోసం ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని క్రియాశీలక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే లక్షకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని….సంఖ్య మరింత పెరిగేలా అందరం కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ఏ కార్యకర్తకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండదని” హామీ ఇచ్చారు.


మరిడమ్మను దర్శించుకున్న శ్రీ నాదెండ్ల మనోహర్


తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నాదెండ్ల మనోహర్ పెద్దాపురంలో మరిడమ్మ ఆలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం…ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశ్, పెద్దాపురం నియోకవర్గ ఇంచార్జి శ్రీ తుమ్మల బాబు సహా పలువురు జిల్లాకు చెందిన జనసేన నాయకులు పాల్గొన్నారు.