Andhra Pradesh Latest News: ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. అక్కడ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నూలి గ్రౌండ్స్‌లో వివిధ వర్గాలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
పరిసరాల పరిశుభ్రత కోసం రాష్ట్రంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మార్చిలో ప్రారంభించిన ఈ కార్యక్రమంతో 9 నెలల్లో అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించేందుకు రెడీ అవుతున్నానని తెలిపారు. తన టూర్ గురించి రెండు గంటల ముందే రివీల్ చేస్తానని చెప్పారు. తాను ప్రయాణించే హెలికాఫ్టర్ ఎక్కడైనా దిగొచ్చని అధికారులకు తెలియజేశారు. ఆ లోపు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్త చేయాలని సూచించారు. తర్వాత జరిగే పరిణామాలకు తనను నిందిస్తే ప్రయోజనం ఉండబోదన్నారు.
గతంలో ఏదైనా పని అనుకుంటే ఇంత సమయం ఇచ్చేవాడిని కాదని ఇప్పుడు మాత్రం చాలా టైం ఇస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంకా మార్పు రాకుంటే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు.
గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని రంగాల్లో విధ్వంసం చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. వాటిని సరి చేసి గాడిలో పెట్టేందుకు ఇన్ని రోజులు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఆర్థికంగా లక్షల కోట్ల అప్పులను మన నెత్తిపై వేశారని మండిపడ్డారు. అవి చెల్లించడంతోపాటు వాటికి అయ్యే వడ్డీలు కూడా కట్టాల్సి వస్తోందని వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఖజానా మొత్తం ఖాళీ చేశారని చంద్రబాబు తెలిపారు. లక్షల కోట్ల అప్పులు,బకాయిలు తమ నెత్తిన రుద్దారని పేర్కొన్నారు. కనీసం రాష్ట్రంలో చెత్తను కూడా తొలగించలేకపోయారని ఎద్దేవా చేశారు.
అన్నింటిని సరి చేసి ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. పింఛన్లు పెంచామని వివరించారు. త్వరలోనే మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. అందుకే స్వర్ణాంధ్ర 2047 పేరుతో కొత్త విధానం తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. వీటితో ఆదాయం పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రజల సమస్యలు, వారి పడుతున్న ఇబ్బందులు తెలుసుుకునేందుకు జిల్లాల్లో తిరుగుతున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. సమస్యల గురించి భయం లేకుండా చెప్పొచ్చని ప్రజలకు సూచించారు. గత పాలకుడు ఎప్పుడైనా ప్రజల్లోకి ఈ మాదిరిగా వచ్చాడా అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు చుట్టూ పరదాలు కట్టేవాళ్లను గుర్తు చేశారు. చెట్లు నరికేసేవాళ్లను తెలిపారు. మాట్లాడేందుకు వాళ్ల మనుషులు తప్ప వేరే వాళ్లను రాణించేవాళ్లు కాదన్నారు.