Pawan Kalyan Latest News: పవన్ కళ్యాణ్ మాట్లాడేప్పుడు స్థిరంగా నించోరు.. మాట్లాడేప్పుడే కాదు.. మాట మీద కూడా సరిగ్గా ఉండరని ఓ విమర్శ ఉంది. అదేం కొత్తదీ కాదు… ఎవరికీ తెలియంది కాదు. అందుకే పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ఆయనే దానిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. అత్యంత తెలివిగా.. ఒడుపుగా ఆయనిచ్చిన సమాధానాన్ని ఎంత మంది అంగీకరిస్తారన్నది తర్వాత విషయం కానీ.. జయకేతనం వేదికపై నుంచి ఆయన చేసిన కొన్ని కామెంట్లపై మాత్రం చర్చ నడుస్తోంది. మాపై హిందీ పెత్తనం ఏంటని తమిళనాడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వేళ.. హిందీ ఉంటే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దేశాన్ని ముక్కులు చేస్తారా..? బహుబాషలు ఉంటే తప్పేంటి.. ? తమిళ సినిమాలు హిందీలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు వంటి వ్యాఖ్యలున్నాయి. ఈ కామెంట్లకు తగిన వివరణలు ఆయన ప్రసంగంలో ఇచ్చారు.. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న… Bro... ఎందుకు వాళ్లని అనవసరంగా కెలకడం.. ?


చేగువేరా నుంచి సనాతనిగా మారిపోవడం.. దక్షిణాదిపై వివక్షతను ప్రశ్నించడం పోయి అఖండ భారత్ గురించి ఆలోచించడం.. బీజేపీ- తెలుగుదేశం వ్యతిరేకత పోయి వారితో కలిసిపోవడం .. ఇవన్నీ నేను మాట్లాడుతోంది మాత్రమే కాదు.. చాలా మంది ప్రశ్నించారు. ఆ విషయంపై పవన్ కళ్యాణ్ స్వయంగా వివరణ ఇచ్చారు. అది కొంత కన్విన్సింగ్‌గానే ఉంది. కానీ ఈ తమిళ తంబిలను ప్రత్యేకంగా టార్గెట్ చేయడమే కొంచం ఆలోచనలో పడేస్తోంది. పవన్ కళ్యాణ్ వంటి చరిష్మాటిక్ లీడర్‌తో తమిళ్ ఎంట్రీ ఇవ్వాలన్న బీజేపీ ఆలోచనలకు ఇది అడ్డంకి కాదా అన్న అనుమానాలు వస్తున్నాయి. భాషాభిమానం విషయంలో తమిళులను మించిన వారు లేరు. దీనిపై అక్కడ పార్టీలంటూ ఉండవ్.. అందరితో ఒకే మావన ట. ఆ మాటలో నుంచే ఎవరికి కావలసిన రాజకీయ లబ్ది వాళ్లు పొందుతారు కానీ… ఈ విషయంలో అందరి కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే. అలాంటి విషయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా మిషన్ తమిళనాడ్ ఎలా సాధ్యం అవుతుంది. ?


పవన్ కళ్యాణ్ మిషన్ తమిళనాడు


బయటకు చెప్పడం లేదు కానీ.. బీజేపీ దక్షిణయానానికి సేనాని జనసేనానే అన్న మాట ఎప్పుటి నుంచో వినిసిస్తోంది. పవన్ కళ్యాణ్ తరచుగా తమళ్‌లో మాట్లాడుతుండటం.. అక్కడ విషయాలను ప్రస్తావించడం.. అక్కడ యాత్రలు చేయడం ఇవన్నీ అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో ఓ ఫీలర్ ఉంది. ద్రవిడ వాదంతో పక్కా కల్చరల్ ఐడెంటిటీతో ఉండే తమిళ పార్టీలను ‘సనాతన’ మార్గంలో ఎదుర్కోవాలన్నది బీజేపీ ప్లాన్. అందుకు పవన్ కళ్యాణే సరైన వ్యక్తని వాళ్లు నమ్ముతున్నారు. దానికి తగ్గట్లే NDA-3లో ఆయన ప్రాధాన్యత పెరిగింది కూడా.. ఇటీవల పవన్ కళ్యాణ్ షణ్ముఖ యాత్రల పేరుతో చేసిన పర్యటనల పరమార్థం కూడా అదేనని అంటుంటారు. 


ప్రో హిందీ మాటలు ఎందుకు Bro ?
జయకేతనం వేదికపై నుంచి జనసేనాని చేసిన ప్రసంగంలో కొన్ని సున్నితమైన విషయాలున్నాయి వాటిని ఆయన బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ… వాటి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి.  National Education Policy- NEP 2020 ని బేస్ చేసుకుని తమిళనాడు DMK సెంటర్‌పై ఫైట్ చేస్తోంది. త్రి భాషా సూత్రం పేరుతో హిందీని మాపై రుద్దడానికి ప్రయత్నం చేస్తోందని దీనిని అంగీకరించేది లేదని తెగేసి చెబుతోంది. DMK, ఎన్డీఏకు వ్యతిరేకం కాబట్టి.. దానిని కార్నర్ చేయడానికి పవన్ కళ్యాణ్ మాట్లాడారులే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ విషయంలో తమిళనాడులో పార్టీలుండవ్. 


అసలు తమిళుల యాంటీ హిందీ మూమెంట్ చరిత్ర తెలియదా.. అక్కడ పార్టీలకతీతంగా అందరూ దీనిని వ్యతిరేకిస్తున్నారని తెలియదా… లేక తెలిసే.. ఎవరూ ధైర్యం చేయని టాపిక్‌ మీద తాను మాట్లాడగలను అని చెప్పడానికి చేశారో తెలీదు. 


హిందీ ఉంటే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కానీ NEPలో ఎక్కడా హిందీ కంపల్సరీ అని లేదు. మూడు భాషలు ఉండాలని మాత్రమే చెప్పారు. అందులో రెండు నేటివ్ భాషలుండాలన్నారు. DMK హిందీని దొడ్డిదారిలో పెట్టడానికి ఇదొక మార్గం అని రాజకీయ స్టాండ్ తీసుకుంది. కానీ అసలు పాలసీలోనే లేని హిందీని … హిందీ ఉంటే తప్పేంటి అని ప్రశ్నించడం ఎందుకు..  వాళ్లు out right గా హిందీని వ్యతిరేకిస్తున్నప్పుడు…. అదే పాయింట్ మాట్లాడితే వాళ్లు హర్ట్ అవుతారు కదా..? పైగా తమిళ్ టాస్క్ కు కూడా ఇది ఇబ్బందే. 1938లో, 1965, 68 ఇలా పలు దఫాలుగా తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం నడిచింది. హిందీ అనే టాపిక్ వాళ్లకి ఓ వైబ్రేషన్. ఇప్పుడు బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న అన్నా డీఎంకే కూడా హిందీకి సపోర్టుగా మాట్లాడదు. అలాంటిది పవన్ ఎందుకు మాట్లాడినట్లు.. 


అప్పుడు దక్షణాది ఇంటిగ్రెటీ… ఇప్పుడు…?
పవన్ కళ్యాణ్ 8 ఏళ్ల క్రితం దక్షణాది స్టాండ్ తీసుకున్నారు. దక్షణాది రాష్ట్రాల పన్నులపై ఉత్తరాది బతుకుతోందని ప్రశ్నించారు. దక్షణాదిలో హిందీ ఉన్నప్పుడు ఉత్తరాదిలో సౌత్ లాంగ్వేజ్‌లను ఎందుకు ప్రమోట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు స్టాలిన్ అడుగుతోంది కూడా అదే. అయితే పవన్ కళ్యాణ్ అప్పట్లో హిందీని వ్యతిరేకించలేదు. సౌత్‌ లాంగ్వేజ్‌లకు హిందీతో సమానమైన ప్రాతినిధ్యం ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు బహుభాషలు ఉండాలన్న ఉదాత్త ఆశయం ఆయనకు ఉండొచ్చు… కానీ తమిళనాడు  ప్రభుత్వ విద్యా విధానంలో 50ఏళ్లుగా రెండు భాషలే ఉన్నాయి. దీనినే తమిళనాడు సమర్థించుకుంటోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు విద్య విషయంలో ఓ రాష్ట్ర అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పోనీ రాజకీయ ఉద్దేశ్యంతో చేశారు అనుకున్నా.. అక్కడ పార్టీలు, ప్రజలు అందరూ వ్యతిరేకించే హిందీని ప్రమోట్ చేయాలని చెప్పడం ద్వారా ఏం సాధిస్తారు.. పోనీ ఇంతకు ముందు మాట్లాడినట్లు.. హిందీలాగానే దక్షణాది భాషలను ఉత్తరాదిలో పెట్టాలని చెప్పలేదు. 


సైద్దాంతిక గందరగోళం 


పవన్ కళ్యాణ్‌లో సైధ్దాంతిక గందరగోళం ఉన్నట్లు కూడా అనిపిస్తుంటుంది. నేషనల్ మీడియా తనను లెఫ్ట్ -రైట్- సెంటర్ అని విమర్శించింది అంటోందని.. తాను అన్నీ సిద్ధాంతాల్లోని మంచినే తీసుకున్నానని పవన్ చెప్పారు. కానీ అలా ఉన్నది ఆయనొక్కడే కాదు… ఈ దేశంలో బద్ధ విరోధులుగా ఉండే కమ్యూనిస్టులు, బీజేపీ భాగస్వామ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఫామ్ అయింది. అప్పుడు లైఫ్ట్ -రైట్ కలిసినట్లే.  ఇప్పుడు బీజేపీతో ఉన్న చంద్రబాబు ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. చాలా పార్టీలు అలా ఉన్నాయి. అయితే ఈ పార్టీలు తమ సిద్ధాంతానికి, కనీసం తమ ఓటు బ్యాంక్‌కు ఇబ్బంది తెచ్చుకునే పనులు చేయవ్. కిందటి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీని కేంద్రంలో చేరమని ఎంత ఒత్తిడి వచ్చినా.. తనకు ఉండే మైనార్టీ ఓట్లు పోతాయనే ఉద్దేశ్యంతో జగన్ మోహనరెడ్డి ఆ పని చేయలేదు. బీజేపీతో కలిసినా సరే.. తమకున్న సెక్యులర్ ట్యాగ్ పోకూడదని టీడీపీ ప్రయత్నిస్తుంటుంది. ముస్లిం, మైనార్టీల హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటామని చెబుతుంది. పొత్తులో ఉన్నా చాలా పార్టీలు తమ ఐడెంటినీ కాపాడుకుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళుతున్నట్లు కనిపిస్తుంటుంది. పొత్తులో గౌరవించుకోవడం కావలసిందే కానీ.. ఈ స్ట్రాంగ్ స్టాన్స్ అనేది ఆయనలోని స్థిరత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది.