Amalapuram Private Hospital News: కాసుల కక్కుర్తిలో ప్రయివేటు గైనిక్‌ ఆసుపత్రులు కఠినంగా అమలు చేయాల్సిన నిబంధనలు తుంగలో తొక్కి అమాయక బాలింతల మరణాలకు కారకులుగా నిలుస్తున్నాయి. మాతాశిశు మరణాలు తగ్గించాలన్న ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడిచేవిధంగా వ్యవహరిస్తోన్న ఓ ప్రయివేటు ఆసుపత్రి నిర్వాకంతో మైనర్‌ బాలిక చనిపోయింది. ప్రసవం అనంతరం మృతి చెందిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులకు డబ్బు ఎరచూపి సెటిల్‌మెంట్‌ చేసుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. 


అమలాపురంలోని ఓ తల్లీపిల్లల ప్రయివేటు ఆసుపత్రిని నడుపుతున్న వైద్య దంపతుల నిర్లక్ష్యానికి ఇటీవల కాలంలో ముగ్గురికి పైగా బాలింతలు మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. తాజాగా ఓ ప్రసవానంతరం రెండు రోజుల వ్యవధిలో ఓ బాలింత మృత్యువాత ప‌డింది. ఈ సంఘటనకు సంబంధించి మృతిచెందిన బాలింత మైనర్‌. ఆమె గురించిన సమాచారం వెంటనే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి రిజిస్టర్‌లో 20 సంవత్సరాలు నమోదు చేసి కొన్ని నెలలుగా వైద్యం అందించారు.


నాలుగు రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా డెలివరీ చేశారు. అయితే బిడ్డతోపాటు తల్లి తీవ్ర అస్వస్థతకు గురికాగా చివరి దశలో చేతులెత్తేసిన వైద్య దంపతులు మరో ఆసుపత్రికి పంపించేశారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై బాలింత బంధువులు ఆందోళనకు దిగుతున్నారని తెలిసి వారిని కూర్చోబెట్టి డబ్బు ఎర చూపి సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. 


మదర్‌ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ సిస్టంను తుంగలో తొక్కి..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాతా శిశుమరణాలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం మదర్‌ ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌ ట్రాక్‌ సిస్టంను అమలు చేస్తోంది. గర్భం దాల్చింది మొదలుకుని ప్రసవం అనంతరం శిశువు సంరక్షణ వరకు ఈ ట్రాక్‌ సిస్టం ద్వారా ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్‌ మోనిటరింగ్‌ ఉంటుంది. అయితే గర్భిణీ గనుక మైనర్‌ అయ్యుండి రహస్యంగా ఆసుపత్రికి వచ్చినట్లయితే వెంటనే ఆ సమాచారాన్ని ఆరోగ్యశాఖ కార్యకర్తలకు సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ తుంగలో తొక్కింది.. సదరు తల్లీపిల్లల ఆసుపత్రి యాజమాన్యం. ఆధార్‌ కార్డులో ఒక వయస్సు ఉంటే రిజిస్టర్‌లో 20 ఏళ్లు అని రాసి వైద్యం అందించారు.


ఇటీవల పెరుగుతోన్న మాతాశిశు మరణాలు..?
మాతాశిశు మరణాల రేటు నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల నిర్వాకంతో మాతాశిశు మరణాల రేటు తగ్గకపోగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో మాతా మరణాలు ఎక్కువగా మైనర్‌ గర్భిణీల ప్రసవం అనంతరం జరుగుతున్నట్లు ఇటీవల చోటుచేసుకున్న పలు సంఘటనలను బట్టి తెలుస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇక శిశు మరణాలు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్‌ మోనటరింగ్‌ ఉన్నా కూడా ఈతరహా మరణాలు వెలుగులోకి రానివి ఎన్నో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.