డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  బైకు ర్యాలీలో సైలెన్సర్స్ తీసి తిరుగుతున్న నలుగురు యువకుల వాహనాలను అమలాపురం పట్టణ పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఖాకీ వర్సెస్‌ ఖద్దర్ వివాదంగా మారింది. విషయం తెలుసుకొని స్పాట్‌కు వచ్చిన మంత్రి పినిపె విశ్వరూప్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. 


అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉదయం నుంచి కొంతమంది యువకులు వెహికల్స్‌కు సైలెన్సుర్లు తీసివేసి ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు చూసి చూడనట్టు వ్యవహరించిన పోలీసులు కొద్ది సేపటికి వెహికల్స్‌ను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ యూత్‌కు చెందిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 


తన అనుచరుల వెహికల్స్ స్వాధీనం చేయడంతో మంత్రి తనయుడు శ్రీకాంత్ రంగంలోకి దిగారు. డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఈ విషయంలో అమలాపురం డిఎస్పి మాధవరెడ్డి శ్రీకాంత్ మధ్య కొంత వివాదం చోటుచేసుకుంది. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిల్స్‌ను వదిలేయాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జయంతి సందర్భంగా ర్యాలీ చేస్తున్నారని దీనికే ఇంత హడావిడి చేయాలా అంటూ ప్రశ్నించడంతో డిఎస్పీ మాధవ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటే జోక్యం చేసుబోబోమని అన్నారు. ఈ క్రమంలోనే మంత్రి తనయుడికి, డీఎస్పీ మాధవరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడి నుంచి కోపంతో శ్రీకాంత్ వెనుదిరిగారు. 


జరిగిన సంఘటనను శ్రీకాంత్ తండ్రి విశ్వరూప్ కు చెప్పారు. కుర్రాల వెహికల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తన కుమారుడితో వివాదం జరగడంతో మంత్రే నేరుగా జోక్యం చేసుకున్నారు. విజయవాడలో అంబేద్కర్ జయంతి వేడుకలు ముగించుకుని అమలాపురం వస్తున్న మంత్రి సరాసరి  అమలాపురం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. గేట్ బయట వున్న దళిత యువకులు మంత్రిని చూడగానే రెట్టించిన ఉత్సాహంతో నినాదాలు చేశారు. 


మంత్రి వచ్చినట్లు తెలియగానే తన ఆఫీస్ నుంచి డిఎస్పీ మాధవ రెడ్డి బయటకు వచ్చి విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న మంత్రి  వెహికల్స్‌ను వెంటనే విడిచి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సైలెన్సర్స్‌ పెట్టుకొని వెహికల్స్‌ను తీసుకెళ్లిపోవచ్చని డీఎస్పీ బదులిచ్చారు. అంతే మంత్రికి కోపం వచ్చేసింది. 


అక్కడే ఉన్న యువకులు డిఎస్పీతో వాగ్వాదానికి దిగారు. సినిమా నటుల పుట్టినరోజు వేడుకలకు సైలెన్సర్లు తీసి హంగామా చేసిన వారిపై చర్యలు ఉండవా అని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి రోజున నిబంధనలు గుర్తుకు వస్తాయా అంటూ నిలదీశారు. అదే స్థాయిలో డిఎస్పి మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధంగా సైలెన్సులు తీసి తిరిగిన వెహికల్స్‌ను గతంలోని సీజ్ చేశామని, కావాలంటే చూసుకోవాలని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నాయని అన్నారు. 


దీంతో  మంత్రి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ గురించి నాకు తెలుసు. చలో అమలాపురానికి పిలుపుమంటావా, ఇప్పుడున్న పోలీసులకంటే వంద రెట్లు వచ్చినా ఏమీ చేయలేరన్నారు. 


పరిస్థితి సీరియస్‌ అవుతుందని గ్రహించిన పోలీసులు మోటార్ సైకిల్స్‌ను కుర్రాళ్లకు ఇచ్చేయడం వివాదం ముగిసింది. కానీ మంత్రి చేసిన కామెంట్స్ మాత్రం వైరల్‌గా మారుతున్నాయి.