స్వాతంత్ర్యం కోసం, దేశం, అడవి బిడ్డల కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ‘‘ఆయన నడిచిన నేల అయినందున మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అని కూడా పేరు పెట్టుకున్నాం. 125వ జయంతి సందర్భంగా అల్లూరి జిల్లాలో కూడా ఓ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది.’’ అని సీఎం జగన్ అన్నారు. భీమవరంలోని పెదఅమిరంలో ఏఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ వేదికపై సీఎం జగన్ మాట్లాడారు.


ఒక మనిషిని, ఇంకొక మనిషి.. ఒక జాతిని, మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజం కోసం మన దేశంలో స్వాతంత్య్ర  సమరయోధులు ప్రయత్నించారని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం అని ఆయన తెలుగు గడ్డపై పుట్టడం మనకి ఓ గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు.


Also Read: దేశంలో తొలి ఎన్‌ కౌంటర్ అల్లూరి సీతారామరాజుదే - మన్యం వీరుడంటే బ్రిటీషర్లకు అంత భయమా!


భీమవరం వచ్చిన ప్రధానికి సీఎం జగన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ‘‘గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నటుడు చిరంజీవికి స్వాగతం పలుకుతున్నా, అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషం. పరాయి పాలనపై మన దేశం యుద్ధం చేస్తూ అడుగులు ముందుకేసింది. లక్షలమంది త్యాగాల ఫలితమే ఇవాళ్టి భారతదేశం. పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి. తెలుగుజాతి, భారతదేశానికి గొప్ప స్ఫూర్తిప్రదాత ఆయన. అల్లూరి ఘనతను గుర్తుంచుకునే.. ఆయన పేరు మీద మనం జిల్లా పెట్టుకున్నాం. ప్రతి మనిషి గుండెల్లో అల్లూరి చిరకాలం ఉంటారు’’ అని సీఎం జగన్‌ ప్రసంగించారు.



భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి వారసులను ఘనంగా సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సోదరుడి కుమారుడైన 80 ఏళ్ల శ్రీరామరాజు అనే వ్యక్తికి మోదీ వంగి నమస్కరించారు.


భీమవరానికి వచ్చిన ప్రధానికి ధన్యవాదాలు: కిషన్ రెడ్డి
తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. విగ్రహావిష్కరణకు హాజరైన ప్రధానికి తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం తెలిపారు. ‘‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యం కోసం అనేకమంది మహానుభావులు త్యాగం చేశారు. తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు చరిత్ర, పోరాటం స్ఫూర్తిదాయకం’’ అని  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.


Also Read: అల్లూరి 8 ఏళ్లదాకా పెరిగింది ఇక్కడే, వీరమరణం తర్వాత ఆయన తమ్ముడు ఏం చేశారో తెలుసా?