Alluri SitaRama Raju 125 Jayanthi Celebrations: తమది ఎంతో నాగరీకమైన న్యాయ వ్యవస్థ అని చెప్పుకునే బ్రిటీషర్స్ మన దేశానికి అంటగట్టిన అవలక్షణాలలో ఎన్ కౌంటర్ ఒకటి. అంతవరకూ ఎన్నడూ లేని ఈ విధానానికి బలైన తొలి వ్యక్తిగా మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కావడం తెలుగువాళ్ల హృదయాలను కలిచివేసే సంఘటన. అప్పట్లో వ్యతిరేకించడానికి, ఖండించడానికి అల్లూరి అభిమానులకు చదువూ లేదు. ఒకవేళ ఉన్నా ఎలా ప్రశ్నించి పోరాడాలో అంతగా తెలియదు. శత్రువునైనా చేతిలో ఆయుధం లేకుండానే, నిద్రిస్తున్న సమయంలోనో, కనీసం ఎలాంటి విచారణ చెయ్యకుండానో చంపడం అనేది అటు గిరిజనులకు గానీ, ఇతర స్వాతంత్య్ర వీరులకు గానీ తెలియంది కాదు. కానీ ఇలా దొరికిన అల్లూరిని దొరికినట్టు చెట్టుకు కట్టేసి, ఎలాంటి విచారణ చెయ్యకుండా కాల్చి చంపడం అనేది నాటి భారతీయ సమాజం కనీసం కలలోకూడా ఊహించలేని ఘటన. నేడు (జూలై 4న) అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.


అల్లూరికి ముందూ, ఆ తరువాత కూడా స్వాతంత్య్ర వీరులు ఉన్నారు. వాళ్ళకి సైతం శిక్షలూ విధించారు. అందులో ఉరి తీయబడిన  భగత్ సింగ్ లాంటి వారు ఉన్నారు. అంతకంటే చాలా కాలం ముందే ఉరితీతకు గురైన కట్ట బొమ్మన్, తాంతియా తోపే లాంటివారు ఉన్నారు. కానీ వారందరికీ కనీసం తమ తరఫున వాదన వినిపించే అవకాశం దక్కింది (అది బ్రిటీష్ వాళ్ళు విన్నా, వినకపోయినా సరే ). అసలు మొదటి స్వాతంత్య్ర యుద్దాన్ని మొదలు పెట్టిన మంగళ్ పాండేను కూడా విచారణ జరిపాకే ఉరితీశారు,'కానీ అల్లూరి సీతా రామరాజు విషయంలో మాత్రం అలాంటి అవకాశమే ఇవ్వలేదు. దొరికినవాడిని దొరికినట్టు కొయ్యూరు చెట్టుకు కట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఆయనంటే బ్రిటీషు వాళ్ళకి అంతటి ద్వేషం, భయం. 


ఆ రోజుల్లోనే 40 లక్షలు ఖర్చు పెట్టిన బ్రిటిషర్లు
అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వాళ్ళను ఎంతలా భయపెట్టాడంటే.. ఎలాగైనా ఆయన్ను పట్టుకోవడానికి దాదాపు 40 లక్షల రూపాయలను ఖర్చు చేసింది బ్రిటీష్ ప్రభుత్వం. అంతవరకూ వారికి ఆస్థాయి ప్రతిఘటన తెలుగు వాళ్ళ నుండి, దేశంలో మరెక్కడా ఈ తీరుగా ఎదురవకపోవడమే దానికి కారణం. దేశంలో చాలా చోట్ల బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన నేతలు, యోధులు ఉన్నారు. కానీ తెలుగు వాళ్ళనుండి అలాంటి విప్లవాన్ని వాళ్ళు ఊహించలేదు. పైగా కేవలం విల్లంబులు ధరించిన వ్యక్తి , కొంతమంది గిరిజనులను సైన్యంగా మర్చి, తమ వద్ద నుండే తీసుకుపోయిన తుపాకులూ, తూటాలతో తమపైనే యుద్ధం ప్రకటించడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. పైగా తమ ఎత్తులకు ఎప్పటికి అప్పుడు పై ఎత్తు వేసి తిప్పికొట్టడాన్ని, అడవుల్లో గిరిజనుల సమస్యలు తీరుస్తూ సమాంతర ప్రభుత్వంగా మారడాన్ని బ్రిటీష్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.


అసలు విప్లవానికి కారణం ఇదే.. 
1882లో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ను అమలులోకి తెచ్చిందీ ప్రభుత్వం . దీని ద్వారా అడవులలో పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులపై ఆంక్షలు వచ్చాయి. దీనికి తోడు బ్రిటీష్ వాళ్ళ వద్ద ఉద్యోగాల్లో చేరిన కొందరు స్వదేశీ బంటులే గిరిజనులకూ, ప్రభుత్వానికి మధ్య అడ్డంకిగా తయారయి గిరిపుత్రులను దోపిడీకి గురిచేసేవారు. అలాంటి వారిలో కొందరు విశాఖ ఏజెన్సీలో చేరి గిరిజనులను ఇబ్బందులకు గురిచెయ్యడాన్ని సహించని అల్లూరి తిరగబడ్డారు. అప్పటికే గిరిజనుల మధ్య ఒక నమ్మకమైన వ్యక్తిగా, వైద్యం లాంటి కొన్ని విద్యలు తెలిసినవాడిగా పేరుపడ్డ అల్లూరి.. గిరిజనులను సమీకరించి వారికి బాణం వెయ్యడం వంటివి నేర్పి తిరుగుబాటుకు సన్నద్ధం చేశారు. కానీ ఆ ఆయుధాలు బ్రిటీష్ వారిని ఆపలేవని చింతపల్లి, కృష్ణదేవి పేట , రాజవొమ్మంగి లాంటి పోలీస్ స్టేషన్ లపై దాడి చేసి తుపాకులు, తూటాలూ పట్టుకెళ్ళిపోయారు. పైగా అలా తీసుకెళుతున్నట్టు స్టేషన్ రిజిస్టర్ లో సంతకాలు కూడా చేసేవాడు. ఇవన్నీ బ్రిటీష్ వారికి తలకొట్టేసి నట్టయ్యేది. ఏజెన్సీ కమీషనర్ హిగ్గిన్స్ రామరాజు తలపై 10,000 రూపాయల రివార్డ్ ప్రకటించాడు. ఇది ఆనాటి లెక్కల్లో చాలా పెద్ద మొత్తం . 


బ్రిటీష్ వాళ్లను వణికించిన ఆ  రెండు చావులు 
బ్రిటీష్ అధికారులు అల్లూరి చేతిలో తిన్న ఎదురుదెబ్బలు అన్నీ ఒకటైతే.. 1922 సెప్టెంబర్ 24న అల్లూరిని వేటాడడానికి బయలుదేరిన బ్రిటీష్ సైన్యం  దామనపల్లి ఘాట్ వద్దకు చేరుకోగానే అల్లూరి సీతారామరాజు దళం వారిపై దాడి చేసింది. తమ వద్ద పెద్దఎత్తున తుపాకులూ, సైన్యం వెంట ఉన్నా అది ఘాట్ రోడ్డు కావడం.. అల్లూరి సైన్యం ఆ ఘాటీ రోడ్డు కి ఇరువైపులా ఎత్తైన ప్రాంతంలో ఉండి  కాల్పులు మొదలుపెట్టడం తో స్కాట్, హైటర్ అనే అధికారులు అల్లూరి దళాన్ని ఏమీ చేయలేకపోయారు. ఆ యుద్ధంలో స్కాట్, హైటర్‌లు ఇద్దరి తలలోకి తూటాలు దూసుకుపోవడంతో వారిరువురూ అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఈ దాడి కోసం అల్లూరి సీతారామరాజు తాను ఉత్తరాది యాత్రలో ఉన్నప్పుడు తెలుసుకున్న గెరిల్లా పద్దతిని అనుసరించారు. అయితే ఏఈ ఈ దాడిలో పాల్గొన్న భారతీయ సైనికులు ఎవరికీ  అల్లూరి సీతారామరాజు ఎలాంటి హానీ తలపెట్టలేదు. దాంతో అధికారుల శవాలను అక్కడే వదిలేసి సైనికులు ఇంటిదారి పట్టారు. తరువాత అదే బ్రిటీష్ అధికారులు 500 రూపాయలు జరిమానా కట్టి ఆ రెండు శవాలనూ వెనక్కు తెచ్చుకున్నారు. ఇది బ్రిటీష్ వాళ్ళను అల్లూరిని మట్టుబెట్టేందుకు నిశ్చయించుకునేలా చేసింది. 


విశాఖ కలెక్టర్‌గా రూథర్ ఫర్డ్ నియామకం 
ఇక పదవీ నిర్వహణలో కఠినంగా ఉంటాడనే పేరున్న రూథర్ ఫర్డ్ విశాఖ కలెక్టర్‌గా  రావడం, అల్లూరి కోసం గెరిల్లా యుద్ధం తెలిసిన ప్రత్యేకంగా మలబారు స్పెషల్ పోలీసులు, అస్సాం రైఫిల్ దళాలను విశాఖ మన్యంలో దింపారు. అల్లూరి ఆచూకీ కోసం గిరిజన మహిళలపై, ప్రజలపై తీవ్ర హింసలు జరిపాడు. అనంతరం చింతపల్లె అడవుల్లో నిరాయుధుడిగా ఉన్న అల్లూరిని పట్టుకున్న బ్రిటీష్ పోలీసులు ఆయన్ను చెట్టుకు కట్టేసి నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. అయన మృతదేహాన్ని మంచానికి కట్టేసి దూరంగా తీసుకెళ్లి కాల్చి బూడిద చేశారు. ప్రస్తుతం ఆయన సమాధి కృష్ణదేవి పేట వద్ద ఉంది. 


దేశంలో ఎన్‌కౌంటర్‌లకు నాంది పలికిన అల్లూరి ఘటన
బ్రిటీష్ పాలనా నుండి ముక్తి లభించాక, 1970 నుండి 90 దశకాల మధ్య  అనేక ఎన్‌ కౌంటర్‌లు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఇటీవలి కాలంలో పౌరహక్కుల ప్రతినిధుల పోరాట ఫలితంగా ఇలాంటి అవాంఛనీయ ధోరణులు  తగ్గుముఖం పట్టాయి. కానీ , కనీసం తనవైపు వాదన వినిపించే అవకాశమే లేకుండా ఒక మనిషిని నిలువునా చంపేసే భయంకరమైన ఎన్ కౌంటర్ అనే చెడు సంప్రదాయానికి మొదటగా బలైంది మన అల్లూరి సీతారామరాజు కావడం మాత్రం ప్రతీ తెలుగువాడూ ఎన్నటికీ మరిచిపోలేని చేదు వాస్తవమని ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ సూర్య నారాయణ పేర్కొన్నారు.


Also Read: Alluri Sitarama Raju: అల్లూరి 8 ఏళ్లదాకా పెరిగింది ఇక్కడే, వీరమరణం తర్వాత ఆయన తమ్ముడు ఏం చేశారో తెలుసా?