డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకులవారి మెరకలో తల్లీ కూతుళ్ల సజీవ దహనం అయిన ఘటనలో విస్తుపోయే నిజాలెన్నో పోలీసుల విచారణలో వెల్లడవుతున్నాయి. ఇల్లు కాలిపోయిన సంఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ కూతుర్లు సాధనాల మంగాదేవి, గర్భిణి అయిన ఆమె కుమార్తె మేడిశెట్టి జ్యోతి (23) సజీవ దహనం అయ్యారు. ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో బాధితుల ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని పక్కనే ఉన్న వారి కుటుంబీకులు తెలిపారు. ఆ సమయంలో ఒక గదిలో మృతులిద్దరూ నిద్రిస్తుండగా మరో గదిలో యువతి తండ్రి నిద్రిస్తున్నాడు. మంటల ధాటికి బయటకు పరుగులు పెట్టానని, అయితే అప్పటికే పక్క గదిలో మంటలు తీవ్రంగా ఎగసిపడ్డాయని తెలిపాడు. 


ఇదిలా ఉంటే మృతులిద్దరిలో ఒకరైన మేడిశెట్టి జ్యోతి అయిదు నెలల క్రితం ఇదే గ్రామంలోని దైవాలపాలెంకు చెందిన మేడిశెట్టి సురేష్ ప్రేమవివాహం చేసుకోగా ఆమె మూడో నెల గర్భిణి. ఈ ప్రాంతంలో గ్రామ దేవత తీర్థమహోత్సవం జరగ్గా నిన్ననే ఇంటికి తీసుకువచ్చి వదిలి వెళ్లాడని కుటుంబికులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మృతుల కుటుంబీకులు వ్యక్తం చేసిన పలు అనుమానాలు ఆధారంగా మృతురాలిలో ఒకరైన జ్యోతి భర్త మేడిశెట్టి సురేష్ ను అదుపులోకి విచారిస్తున్నారు పోలీసులు. అతని ద్వారా రాబట్టిన అనేక సమాచారం ఆధారంగా కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది. 


ఈ విచారణలో పోలీసులు సైతం విస్తుపోయేలా చాలా వాస్తవాలు వెలుగు చూసినట్లు సమాచారం. మరోపక్క దగ్ధమైన ఇంటి మార్గంలోనే ఓ ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ఆ దిశగా ప్రారంభించారు. తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో యాక్టివా బండి పై ఇద్దరు అటువైపుగా రాకపోకలు సాగించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు గ్రామ దేవత తీర్థ మహోత్సవం సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేసిన యువకులు వాటిని తీసివేసే క్రమంలో పనిచేసుకుంటుండగా అటువైపుగా ఇద్దరు తెలుపు రంగు యాక్టివా బండిపై వెళ్లినట్లు చూసామని సమాచారం అందించారు. దీంతో ఆ దిశగా విచారణ చేసిన పోలీసులకు ఖచ్చితమైన ఆధారాలు లభించడంతో ఒక మహిళతోపాటు ఆమె ఇద్దరు కుమార్తెలను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. 


ఈ సమాచారం ఆధారంగా ఇల్లు దగ్ధమైన సంఘటన ప్రమాదం కాదని కచ్చితంగా హత్యా ప్రయత్నమేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే క్లూస్ టీం, జాగిలాల ఆధారంగా కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన వాస్తవాలను బట్టి హత్యా నేరంగా కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇల్లు దగ్ధం కుట్ర కోణంలో మృతురాలు జ్యోతి భర్త మేడిశెట్టి సురేష్ పాత్ర గురించి ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.


మరో పక్క వివాహేతర సంబంధం రెండు రెండు ప్రాణాలను బలిగొందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి భర్త మేడిశెట్టి సురేష్ కు, పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ఓ యువతకి మధ్య ఇంతకుముందు వివాహేతర సంబంధం ఉందని, ఈ కారణంగానే ఇల్లు దగ్ధం చేయడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నిందితుల టార్గెట్ కేవలం జ్యోతేనని, ఆ రోజు జ్యోతితో కూడా నిద్రించిన ఆమె తల్లి సాధనాల మంగాదేవి ఈ కుట్రలో బలైపోయినట్లు సమాచారం. పక్కా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ తో మృతురాలు జ్యోతిని అంతం చేయడానికి పథకం పన్నారని, ఈ కుట్రలో పథక రచన చేసింది ఆ మహిళ కాగా అమలు చేసింది ఇద్దరు కుమార్తెలని అనుమానాలు వస్తున్నాయి. చేతికి ధరించే గ్లోవ్స్ సమీపంలోనే ఓ జనరల్ స్టోర్ లో కొనుగోలు చేసినట్లు, పెట్రోల్ కూడా కొంచెం  దూరంలో ఉన్న కిరాణా షాపు దగ్గర కొన్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు విశ్వసనీయ సమాచారం.


ఏదేమైనప్పటికీ జ్యోతికి వివాహమై అయిదు నెలలే కావస్తుండగా.. పెద్దల మాటలు వినకుండా ప్రేమ వివాహం చేసుకున్న జ్యోతి, ఆమె తల్లి ఇద్దరూ అనుమానాస్పద రీతిలో సజీవ దహనం అయ్యారు. పోలీసులు దర్యాప్తులో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందనేది చూడాలి.