Konaseema News | మాకు తెలిసిన అమ్మాయితో నువ్వు చాటింగ్‌ చేస్తావా.. ఇంకేం చేశావ్‌... అంటూ ఓ యువకుడ్ని నలుగురు యువకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చావబాదిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈనెల 5వ తేదీన చోటుచేసుకున్న ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మలికిపురం గ్రామంలో జరిగినట్లుగా పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఆ వీడియోలో దారుణంగా దెబ్బలు తిన్న యువకుడిది మలికిపురంలోని గూడపల్లి ప్రాంతానికి చెందిన రామేశ్వరపు జయశంకర్‌ యువరాజుగా గుర్తించారు.


నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


యువకుడిపై దాడికి పాల్పడిన నలుగురు యువకులది మలికిపురంకు చెందిన వారిగా గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో మంగళవారం నుంచి వైరల్‌ కాగా ఇంతకీ బాధితుడిని చావబాదుతూ దాడికి పాల్పడిన వారే వీడియో తీసి వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కు షేర్‌చేశారని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమై వెంటనే బాధితుడి తండ్రి రామేశ్వరపు శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా, ఇటీవలే చోటుచేసుకున్న బైక్‌ యాక్సిడెంట్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. 


అమ్మాయి విషయంలో వివాదం..


బాధిత యువకుడు మలికిపురంలోని ఏఎఫ్‌డీటీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. ఇదే ప్రాంతంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతితో పరిచయం కాగా ఆమెతో చాటింగ్‌ చేశాడు. ఆ యువతి సమీప బంధువు అయిన రవి అనే యువకుడు ఆమె సెల్‌ఫోన్‌లో యువరాజు చేసిన చాటింగ్‌ చూసి ఆమెను నిలదీయగా కేవలం చాటింగ్‌ చేస్తున్నాడని చెప్పడంతో ఆగ్రహావేశానికి గురైన రవి అతని స్నేహితులతో కలిసి బాధితుడు యువరాజును నిర్మానుష్యంగా ఉన్న కొబ్బరి తోటల్లోకి తీసుకెళ్లి బీరుబాటిళ్లు, తాటి కమ్మలతో దాడికి పాల్పడ్డాడు. 



Also Read: YS Sharmila: 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లుంది' - కడప స్టీల్ ప్లాంట్‌‌పై జగన్‌వి ఆస్కార్ డైలాగులన్న షర్మిల, టెంకాయలు కొట్టి వినూత్న నిరసన




నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు..


మలికిపురంలో నవంబర్ 5న చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో వీడియోలో దాడికి పాల్పడిన యువకులను గుర్తించి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలు జారీచేశారు. దీంతో రంగంలోకి దిగిన రాజోలు టి.నరేష్‌ కుమార్‌, మలికిపురం ఎస్సై సురేష్‌లు నలుగురిపై కేసు నమోదు చేశారు. బాధితుడు మలికిపురంలోని ఏఎఫ్‌డీటీ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడని, అదేవిధంగా దాడికి పాల్పడిన నలుగురు కూడా ఇదే కళాశాలలో ఇంటర్‌ చదుకుని ఖాళీగా ఉంటున్నారని తెలిపారు. ఓ అమ్మాయి విషయంలో గొడవపడి ఈ దాడికి పాల్పడ్డారని, ఎవరైనా విద్యార్థులు ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు. 


Also Read: Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం