Ongole Police Notices To Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు (Ramgopal Varma) ప్రకాశం పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న ఒంగోలు (Ongole) రూరల్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని సీఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఆర్జీవీ వాట్సాప్ నెంబరుకు నోటీసు పంపించారు. అయితే, మంగళవారమే విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులివ్వగా వారం రోజులు గడువు కావాలని కోరారు. షూటింగుల్లో బిజీగా ఉన్నందున సమయం కావాలని సీఐ వాట్సాప్‌నకు మెసేజ్ పంపించారు. అనంతరం వర్మ తరఫు న్యాయవాదులు సైతం వచ్చి ఒంగోలు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్జీవీ పంపిన లేఖను పోలీసులకు అందజేశారు. కాగా, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారని అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. దీనిపై ఆర్జీవి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ఈ విషయంపై పోలీసులతోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.


వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్


మరోవైపు, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు. అటు, నటుడు పోసాని కృష్ణమురళిపైనా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఓ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని.. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా ఉన్నాయని పేర్కొన్నారు. 


వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పైనా టెక్కలి పీఎస్‌లో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నేత కణితి కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


Also Read: YS Sharmila: 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లుంది' - కడప స్టీల్ ప్లాంట్‌‌పై జగన్‌వి ఆస్కార్ డైలాగులన్న షర్మిల, టెంకాయలు కొట్టి వినూత్న నిరసన