Ys Sharmila Comments On YS Avinash Reddy: కడప స్టీల్ ప్లాంట్ (Kadapa Steel Plant) శంకుస్థాపనలకే పరిమితమైందని.. చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా తయారైందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు వేశారు. బుధవారం కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె కాంగ్రెస్ నేతలతో కలిపి మీడియా ముందే కొబ్బరికాయలు కొట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు అని.. ముఖ్యమంత్రులు మారడం, కొబ్బరి కాయలు కొట్టడం ఇదే తంతుగా మారిందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ కోసం జగన్ చేసిందేమీ లేదని.. కేవలం టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీగానే పాలకులు దీన్ని తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి.. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని నిలదీశారు. ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు.


'ఉద్యోగాలు వచ్చే ఛాన్స్'


పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం వైఎస్సార్ చిత్తశుద్ధితో కడప స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారని.. 10 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలనేది ఆయన ఆశయమని షర్మిల చెప్పారు. 'ఉక్కు పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించే ఛాన్స్ ఉంది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారు. సెయిల్ ద్వారానే ప్లాంట్ నిర్మించాలని విభజన హామీల్లో ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగేది. బీజేపీ ఏపీ పట్ల చిన్న చూపు ఉంది. ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన హామీలను సైతం ఆ పార్టీ తుంగలో తొక్కింది.' అని షర్మిల మండిపడ్డారు.


'జగన్‌వి ఆస్కార్ డైలాగులు'


2019లో అధికారంలోకి వచ్చాక కూడా జగన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మూడేళ్లలో నిర్మాణాన్ని చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని జగన్ అప్పుడు ఆస్కార్ డైలాగులు చెప్పారు. అధికారం, ప్రాంతాలు, కంపెనీలు మారుతున్నా స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. పదేళ్లు ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ కడప స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో ఏం చేశారో సమాధానం చెప్పాలి. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లని జగన్‌కు ఎమ్మెల్యే పదవి ఎందుకు.?. ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని ఆయన.. ప్రతిపక్ష హోదా కావాలని అడగడం సిగ్గుచేటు. కడప ప్రాంత అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమబాట పడుతుంది. అవసరమైతే నిరాహార దీక్ష సైతం చేస్తాం.' అని షర్మిల పేర్కొన్నారు.


అటు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిని కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. 'నాతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతపై పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేసి విచారించడం లేదు.?. వైసీపీ సోషల్ సైకో వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాష్‌ను విచారించి అరెస్ట్ చేయాలి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవరెడ్డి మూలకారణం. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.' అని షర్మిల నిలదీశారు.


Also Read: Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు