50 Years Of Rajamundry Road Cum Railway Bridge: ఓ వైపు గోదారమ్మ ప్రవాహం.. మరోవైపు వంతెనపై రైలులో ప్రయాణం. నదీ ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి రమణీయతను అనుసరిస్తూ చేసే పయనం ఎప్పటికీ మరిచిపోలేం. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. మనం మాట్లాడుతున్నది రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జి. ఈ వంతెనకు శనివారానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ వంతెన విశేషాలేంటో చూద్దామా..!


గోదారమ్మకు మణిహారం


ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి గోదారమ్మకు మణిహారంగా మారింది. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లా రాజమండ్రి (Rajamundry) రోడ్ కం రైలు బ్రిడ్జిని 23 నవంబరు 1974 ఉదయం 11 గంటలకు అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. కొవ్వూరు - రాజమండ్రికి అపురూప బంధం ఉభయ గోదావరి జిల్లాలను కలిపిన ఆత్మీయ వారధి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. ఈ వంతెన కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతమేనని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించారు. ఇండియాలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిల్లో ఇది మూడోది. మొదటిది అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించగా.. రెండోది సోన్‌పూర్ బిహార్‌లో, మూడోది రాజమండ్రి - కొవ్వూరు మధ్య నిర్మించారు.


1964లో మూడో పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు - రాజమండ్రి మధ్య రెండు వరుసలు రైల్ మార్గాన్ని నదిపై బ్రిడ్జిని నిర్మించాలని తీర్మానించారు. అప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు లాంచీలపైనే జరిగేవి. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకూ సరుకు రవాణా కూడా లాంచీలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలనే వినతిని కేంద్రానికి పంపింది. అది కూడా ఆమోదం పొందడం చకచకా సర్వే అనుమతులు చేపట్టి.. జెసోప్ కంపెనీ నిర్మాణం మొదలు పెట్టి 1974 ఆగస్టుకి వంతెన పూర్తైంది. రైలు మార్గం 2.8 కి.మీ రోడ్ మార్గం 4.1 కి.మీ. అప్పటి రాష్ట్రపతి ప్రక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉషశ్రీ ప్రతీ క్షణాన్నీ చక్కగా వర్ణిస్తూ అందరికీ కళ్లకు కట్టినట్టు చూపించారు. లాంచీల ప్రయాణం ఆగింది. కొవ్వూరు - రాజమండ్రి షటిల్ బస్‌లు వేశారు. ఉభయ గోదావరి జిల్లాలు ఒకటయ్యాయి. అందుకే మన గోదారోళ్లకు ఈ బ్రిడ్జి అపురూపం.


Also Read: Srikakulam News: టెక్నాలజీ సాయంతో గంజాయి కట్టడి చేస్తున్న శ్రీకాకుళం పోలీసులు- రంగంలోకి డ్రోన్‌లు