Janasena Vs Ysrcp : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనసేన నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తుంది. వైసీపీ, జనసేన నేతలకు మధ్య మాటామాట పెరగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జగనన్న ఇళ్లు ప్రజలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా సోమవారం తొర్రేడు గ్రామంలోని సచివాలయం వద్దకు జనసేన పార్టీ నాయకులు చేరుకుని జగనన్న కాలనీలకు సంబంధించిన వివరాలు అడిగేందుకు ప్రయత్నించాడు. అయితే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అప్పటికీ సచివాలయానికి చేరుకుని సచివాలయం ప్రధాన ద్వారం వద్ద అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. జనసేన శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. దీంతో ఇరుపక్షాల అరుపులు, కేకలతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు. ఈ దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ సచివాలయం వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని కందుల దుర్గేష్ ఆరోపించారు. సచివాలయంలో ప్రభుత్వ అధికారులు ఉండాలి తప్ప వైసీపీ నేతలకు పనేంటని కందుల దుర్గేష్ ప్రశ్నించారు. ఇటువంటి చర్యలను జనసైనికులు సహించరని ఆయన హెచ్చరించారు. 


వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు- కందుల దుర్గేష్ 


"రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో జరుగుతున్న అవినీతిని బయటకు తెచ్చేందుకు జనసేన ప్రయత్నిస్తుంది. రాజమండ్రి రూరల్ లో చెరువులో ఇళ్ల స్థలాలు కేటాయింపు, ఆవలో స్థలాల పేరిట మోసాలను, టిడ్కో అవినీతి వెలికితీస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ పేరిట రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడింది. ఈ కడుపుమంటతో వైసీపీ నాయకులు తొర్రేడులో మాపై దాడికి పాల్పడ్డారు. తొర్రేడులో జగనన్న కాలనీల్లో సామాజిక తనిఖీ చేసేందుకు మేం సచివాలయ అధికారును వివరాలు అడుతున్నాం. ఎంత మందికి ఇళ్లు కేటాయించారు. పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మేం అడుగుతుంటే వైసీపీ నేతలు మాపై దాడికి పాల్పడ్డారు. మీకు సంబంధం ఏమిటని దుర్భాషలాడిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయడంలేదు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే వారిపై రౌడీయిజం చేస్తున్నారు. బాధితులు ప్రభుత్వం నుంచి వస్తున్న సామాగ్రి రావడంలేదని వాపోతున్నారు. ఇలాంటి దౌర్జన్యాలకు జనసేన భయపడదని స్పష్టం చేస్తు్న్నాం. లబ్దిదారులకు న్యాయపరంగా రావాల్సిన అన్ని అంశాలు వచ్చే వరకూ జనసేన ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది."- కందుల దుర్గేష్ 


జగనన్న ఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు క్యాంపెయిన్ 


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలపై జనసేన ఫైట్ స్టార్ట్ చేసింది. మూడు రోజుల పాటు ఈ పథకంలో ఉన్న లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ఈ పథకం సక్రమంగా జరిగిపోయిందని... లబ్ధిదారులకు న్యాయం జరిగిపోయిందని ప్రకటనలు చేస్తోందని వాస్తవ రూపంలో అంత సీన్ లేదంటోంది జనసేన. అందుకే జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. #Jaganannamoosam అనే హ్యాష్‌  ట్యాగ్‌తో ఈ క్యాంపెయిన్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్టార్ట్ చేశారు.  12,13,14 తేదీల్లో పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు పవన్. జగనన్న కాలనీల్లో అనేక అరాచకాలు జరిగాయని.. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం అని విమర్శిస్తోంది జనసేన. లబ్ధిదారుల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తోన్న జనసేన... సోషల్ ఆడిట్‌ చేయనుంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తుంది.